/rtv/media/media_files/2026/05/30/bike-wife-2026-05-30-08-31-01.jpg)
అత్తింటివారు బైక్ కొనివ్వలేదనే చిన్న కారణంతో ఓ భర్త కఠినాత్ముడిగా మారాడు. కట్టుకున్న భార్యను చున్నీతో ఉరేసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసు కేసు అవుతుందనే భయంతో తను కూడా చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తే కాలయముడిగా మారిన ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి శివారులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మారేపల్లి గ్రామానికి చెందిన దాసరి అంజయ్య (25) అనే యువకుడికి, నారాయణఖేడ్ మండలం సంజీవ్‌రావుపేటకు చెందిన యాదమ్మ (20)తో 11 నెలల క్రితమే పెళ్లయింది. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉన్నా, మద్యానికి బానిసైన అంజయ్య కొన్ని రోజులుగా అత్తింటివారు తనకు బైక్ కొనివ్వాలని భార్యతో గొడవ పడటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ దంపతులు తమ తల్లి, సోదరుడితో కలిసి మారేపల్లి శివారులోని ఒక మామిడితోటను కౌలుకు తీసుకుని, అక్కడే నివాసం ఉంటూ మామిడి పండ్లు అమ్ముకుంటూ బతుకుతున్నారు.
బైక్ కొనివ్వాలంటూ అంజయ్య రోజు గొడవ పడుతుండటంతో.. అత్తింటివారు కూడా త్వరలోనే బైక్ కొనిస్తామని నచ్చజెప్పారు. అయినా వినని అంజయ్య, పెళ్లై 11 నెలలవుతున్నా ఇంకా బైక్ ఇవ్వలేదంటూ ప్రతిరోజూ తాగి వచ్చి భార్యను వేధించేవాడు. శుక్రవారం ఉదయం అంజయ్య తల్లి మామిడి పండ్లు అమ్మడానికి పక్కనే ఉన్న సదాశివపేటకు వెళ్లారు. ఆ సమయంలో తోటలోని ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు.
చున్నీ బిగించి గదిలోనే ఉరేసి
మళ్లీ బైక్ విషయమై ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అంజయ్య.. ఎంత సర్దిచెప్పినా వినకుండా భార్య యాదమ్మ మెడకు చున్నీ బిగించి గదిలోనే ఉరేసి చంపేశాడు. యాదమ్మ ప్రాణాలు పోయాక గానీ అంజయ్యకు తను చేసిన తప్పు తెలియరాలేదు. భార్యను చంపేసినందుకు పోలీసులు కేసు పెట్టి జైల్లో వేస్తారని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో తను కూడా బతకకూడదని నిర్ణయించుకుని, భార్య శవాన్ని గదిలోనే వదిలేసి.. ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక మామిడిచెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఒకేసారి భార్యాభర్తలు ఇద్దరూ శవాలుగా మారిన విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్తయ్యగౌడ్, కొండాపూర్ సీఐ సుమన్ కుమార్, ఎస్సై సోమేశ్వరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతురాలు యాదమ్మ తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన ఏడాది కూడా తిరక్కుండానే ఇలా బైక్ గొడవతో ఇద్దరి ప్రాణాలు పోవడం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.
Follow Us