/rtv/media/media_files/2026/04/20/sridhar-rao-2026-04-20-16-12-27.jpg)
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ముంచిన ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) కేసు నమోదు చేసింది.
ఢిల్లీకి చెందిన 'ఎథీనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా 2021లో హైదరాబాద్‌లో భూమి కొనుగోలుకు సిద్ధమైంది. ఇదే సమయంలో శ్రీధర్ రావు దంపతులు ఆ సంస్థను సంప్రదించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వివాదాస్పద భూములను తమవేనని నమ్మబలికి, ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి వారిని బురిడీ కొట్టించారు. ఈ ఒప్పందంలో భాగంగా అడ్వాన్స్ రూపంలో ఏకంగా రూ.14.85 కోట్లు వసూలు చేశారు.
డబ్బు తీసుకుని జంప్!
డబ్బు చేతికి అందిన తర్వాత శ్రీధర్ రావు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ, చివరకు ఆచూకీ లేకుండా పరారయ్యారు. ఈ క్రమంలోనే 'సంధ్యా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరును 'సంధ్యా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్'గా మార్చి దర్యాప్తు సంస్థల కళ్లుగప్పే ప్రయత్నం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితులపై బెదిరింపులు
తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఎథీనా ప్రాజెక్ట్స్ ప్రతినిధులు కోరగా, శ్రీధర్ రావు వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక ఎథీనా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. విజయ్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్రీధర్ రావుకు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ, కంపెనీ పేరు మార్చి మోసం చేశాడనే ప్రధాన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ముసుగులో అమాయక పెట్టుబడిదారులను మోసం చేసే ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Follow Us