/rtv/media/media_files/2026/05/15/wedding-2026-05-15-18-47-53.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 33 ఏళ్ల త్విషా శర్మ మరణం ఇప్పుడు అనేక అనుమానాలకు, చర్చలకు దారితీసింది. భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌తో ఐదు నెలల క్రితమే వివాహం జరిగిన త్విషా 2026 మే 12 రాత్రి తన అత్తవారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మరణం వెనుక అత్తమామల వేధింపులు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
త్విషా సోదరుడు, భారత సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్న హర్షిత్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10:05 గంటలకు త్విషా తన తల్లికి ఫోన్ చేసి, అత్తవారి ఇంట్లో తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి వివరించారు. మాట్లాడుతుండగానే భర్త గదిలోకి రావడంతో ఆమె ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా త్విషా గానీ, ఆమె భర్త గానీ స్పందించలేదు. .
రాత్రి 10:15 గంటలకు ఆమె అత్త గిరిబాల సింగ్ ఫోన్ ఎత్తి త్విషా పరిస్థితి చూడమని చెప్పగా.. రాత్రి 10:20 గంటలకు త్విషా శ్వాస తీసుకోవడం లేదని సమాచారం అందించారు. ఆసుపత్రి కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్నా, రాత్రి 11:30 గంటల వరకు ఆమెను అక్కడకు చేర్చలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
త్విషాను అత్తమామలు మానసిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, శారీరక హింసకు కూడా పాల్పడ్డారని మేజర్ హర్షిత్ ఆరోపించారు. త్విషాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా గర్భ విచ్ఛిన్నం చేయించారని, ఆమె క్యారెక్టర్‌ను శంకిస్తూ నీచంగా మాట్లాడారని ఆరోపించారు. మరణానికి వారం రోజుల ముందే ఈ అబార్షన్ జరిగినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. తండ్రి కానుకగా ఇచ్చిన రూ. 20 లక్షల విలువైన షేర్లు, పెట్టుబడులను తమ పేరు మీదకు మార్చాలని భర్త, అత్త ఒత్తిడి తెచ్చినట్లు కుటుంబం తెలిపింది.
ఉరి వేసుకోవడం వల్లే
ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. త్విషా ఉరి వేసుకోవడం వల్లే మరణించినట్లు తేలింది. అయితే, ఆమె శరీరంపై మరణానికి ముందు తగిలిన అనేక గాయాలు, కమిలిన గుర్తులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. విష ప్రయోగం జరిగిందేమో తెలుసుకోవడానికి శరీర భాగాల నమూనాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. గోళ్ల నమూనాలు, బట్టలను కూడా డీఎన్ఏ విశ్లేషణ కోసం భద్రపరిచారు.
త్విషా అత్త గిరిబాల సింగ్ రిటైర్డ్ జడ్జి కావడంతో పాటు, భర్త సమర్థ్ సింగ్ న్యాయవాది కావడంతో సాక్ష్యాలను తారుమారు చేస్తారేమోనని బాధితురాలి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పోలీసులు సమర్థ్ సింగ్ , గిరిబాల సింగ్‌లపై వరకట్న వేధింపులు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక సైనికుడి సోదరిగా త్విషాకు న్యాయం జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Follow Us