Mysuru Pub : మైసూర్‌లో కలకలం: రెస్టో-పబ్‌లో భయంకరమైన మంటలు.. ఇద్దరు సజీవదహనం!

కర్ణాటకలోని మైసూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దత్తగల్లి ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఫాక్స్ డెన్ లిక్కర్ గ్యారేజ్ అనే ప్రముఖ రెస్టో-పబ్‌లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

New Update
mysure pub

కర్ణాటకలోని మైసూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దత్తగల్లి ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఫాక్స్ డెన్ లిక్కర్ గ్యారేజ్ అనే ప్రముఖ రెస్టో-పబ్‌లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పబ్‌ కిచెన్‌లో పనిచేసే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతులను పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన సాహిన్ (26), నేపాల్‌కు చెందిన ప్రకాష్ (24)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక, కిచెన్ లోనే చిక్కుకుపోయి వీరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో పబ్ యజమాని, కన్నడ సినీ నటుడైన ప్రీతమ్ పుమీత్‌తో పాటు సోను, రమేష్, మహాదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్ అనే కస్టమర్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సరస్వతీపురం, హెబ్బాల్ ఫైర్ స్టేషన్ల సిబ్బంది నిచ్చెనల సహాయంతో దాదాపు 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొందరు ప్రాణభయంతో పై అంతస్తుల నుండి కిందికి దూకడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో గాయపడిన వారందరినీ మైసూర్‌లోని అపోలో, సుయోగ్ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ప్రాథమిక విచారణ ప్రకారం, పబ్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు అంటుకున్నట్లు ఫైర్ ఆఫీసర్ రంగనాథ్, డీసీపీ హర్షన్ ప్రియంవద తెలిపారు. పబ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రూఫ్‌టాప్‌ టెర్రస్ గార్డెన్‌లో కూడా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ అలంకరణ కోసం ఉపయోగించిన చెక్క వస్తువులు, కేన్ ఫర్నిచర్ వంటి అత్యంత సులభంగా మంటలు అంటుకునే పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్లే మంటలు క్షణాల్లో అంతటా వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు. సోమవారం కావడంతో పబ్‌లో జనం తక్కువగా ఉన్నారని, అదే వీకెండ్ అయి ఉంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదని పోలీసులు తెలిపారు.

తగిన పరిహారం అందేలా

ఈ ఘటనపై స్థానిక శాసనసభ్యుడు జి.టి. దేవేగౌడ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున తగిన పరిహారం అందేలా ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా రూఫ్‌టాప్‌పై పబ్ నిర్వహించడానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో మైసూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అలాగే ఈ ప్రమాదంలో ఏదైనా పేలుడు సంభవించిందా అనే అనుమానాలపై కూడా పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు