/rtv/media/media_files/2026/06/07/rakul-2026-06-07-19-38-32.jpg)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన జీవితంలో ఎదురైన ఒక అత్యంత గడ్డుకాలాన్ని గుర్తుచేసుకుంది. జిమ్‌లో తాను చేసిన ఒక చిన్న తప్పు ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో వివరిస్తూ.. వర్కవుట్స్ చేసేటప్పుడు భద్రతా నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చింది. నేహా ధూపియా, అంగద్ బేడీలు హోస్ట్ చేస్తున్న డబుల్ డేట్ టాక్ షోకు తన భర్త జాకీ భగ్నానీతో కలిసి హాజరైన రకుల్.. ఈ చేదు అనుభవాన్ని పంచుకుంది.
షోలో రకుల్ మాట్లాడుతూ.. సాధారణంగా తాను వర్కవుట్ చేసేటప్పుడు ఎప్పుడూ మరిచిపోని సేఫ్టీ బెల్ట్ పెట్టుకోకుండా, ఒకరోజు జిమ్‌లో ఏకంగా 80 కిలోల బరువుతో డెడ్‌లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. ఆ సమయంలో తన లోయర్ బ్యాక్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పింది. మీ ట్రైనర్ మీకు ఎంత చెప్పినా సరే.. డెడ్‌లిఫ్ట్ అనేది అసలు చేయకూడని చెత్త ఎక్సర్‌సైజ్. అది కేవలం మన ఈగో కోసం చేసే లిఫ్ట్ మాత్రమే అని రకుల్ వ్యాఖ్యానించింది. ఆ రోజు తను చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని, దానివల్ల ఏకంగా 40 రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది.
రోజువారీ జీవితంలో చాలా యాక్టివ్‌గా, ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకునే తనకు.. ఈ గాయం తీవ్ర మానసిక క్షోభను మిగిల్చిందని రకుల్ చెప్పింది. ఇది కేవలం శారీరక గాయం మాత్రమే కాదు, నన్ను మానసికంగా కూడా చాలా దెబ్బతీసింది. నా శరీరం సహకరించకపోవడంతో నా మనసంతా గందరగోళంగా మారిపోయింది. అంతవరకు చకచకా పనులు చేసుకునే నేను.. అకస్మాత్తుగా చిన్న చిన్న అవసరాలకు కూడా ఏమీ చేయలేని స్థితికి వచ్చేసరికి మానసికంగా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేది అని రకుల్ తన బాధను పంచుకుంది.
కొండంత అండగా నిలిచాడు
ఆ కష్టకాలంలో తన భర్త జాకీ భగ్నానీ తనకు కొండంత అండగా నిలిచాడని రకుల్ కృతజ్ఞతగా గుర్తుచేసుకుంది. మనం అంతటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన పార్ట్‌నర్ సపోర్ట్ చాలా అవసరం. నా రికవరీ పీరియడ్‌లో జాకీ నాకు అందించిన సహాయం చాలా పెద్దది. తను నా పక్కనే ఉండి నన్ను చూసుకున్నాడని చెప్పింది. తీవ్రమైన నడుము నొప్పి, కదలలేని పరిస్థితి, నరాల నొప్పితో బాధపడిన రకుల్.. పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాతే నెమ్మదిగా మళ్లీ తన షూటింగ్ పనులను మొదలుపెట్టింది. ఎంత అనుభవం ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ విషయంలో శరీరం చెప్పే మాట వినాలని, సేఫ్టీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదని రకుల్ ఈ సందర్భంగా సూచించింది.
లకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ 2021 నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2024, ఫిబ్రవరి 21న గోవాలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
Follow Us