/rtv/media/media_files/2026/06/15/sanchita-2026-06-15-18-08-41.jpg)
బుల్లితెరపై ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటి సంచిత ఉగాలే ముంబై సమీపంలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రముఖ హిందీ సీరియల్ కుంకుమ భాగ్య,వాగ్లే కీ దునియా వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇంత చిన్న వయసులోనే ప్రాణాలు తీసుకోవడం టెలివిజన్ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో
నలాసోపరా ఈస్ట్‌లోని ఆచోలే విలేజ్‌లో ఉన్న సాయి సంతోషి బిల్డింగ్ నివాసంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటల మధ్య సంచిత తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నారు. ఆ తర్వాత గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆచోలే పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వినోద్ బాగ్ వెల్లడించారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను వసాయ్-విరార్ మున్సిపల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నటి తండ్రి మచ్చీంద్ర ఉగాలే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆచోలే పోలీసులు జూన్ 15న భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
సంచిత ఉగాలే టీవీ రంగంతో పాటు ఓటీటీ, వెండితెరపై కూడా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నారు. జీటీవీలో సుదీర్ఘకాలంగా నడుస్తున్న కుంకుమ భాగ్య సీరియల్‌లో దియా టాండన్ పాత్రతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే వాగ్లే కీ దునియాలో రుచితా జైట్లీగా, దంగల్ టీవీలో వచ్చిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సీరియల్‌లో సోరబ్ బేడి సరసన లీడ్ రోల్‌లో నటించారు. సినిమాల విషయానికొస్తే.. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ఛావాలో తారా రాణి చిన్నప్పటి పాత్రను ఆమె పోషించారు. మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సెలైన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ అనే డిజిటల్ ప్రాజెక్ట్‌లోనూ ఆమె భాగమయ్యారు. కెరీర్ ఎదుగుతున్న సమయంలో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీని కలిచివేస్తోంది.
Follow Us