Kerala : దృఢం నా కధే, దొంగిలించారు..  మాజీ డీజీపీ సంచలన పోస్ట్!

కేరళలో డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత బీజేపీ కౌన్సిలర్‌గా మారిన ఆర్. శ్రీలేఖ రెండు మలయాళ చిత్రాల మేకర్స్‌పై కథల దొంగతనం ఆరోపణలు చేశారు.

New Update
cinema

కేరళలో డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత బీజేపీ కౌన్సిలర్‌గా మారిన ఆర్. శ్రీలేఖ రెండు మలయాళ చిత్రాల మేకర్స్‌పై కథల దొంగతనం ఆరోపణలు చేశారు. దృఢం, భూతకాలం అనే రెండు సినిమాల కథల ముఖ్య ఉద్దేశం.. గతంలో తాను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన కథలు, వీడియోల నుండి కాపీ కొట్టినవేనంటూ ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో సంచలన ఆరోపణలు చేశారు.

ఆమె తన పోస్ట్‌లో రాస్తూ.. "దృఢం అనేది పోలీస్ కథ కావడంతో నేను ఆ సినిమా చూశాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను రాసి, మాతృభూమి మ్యాగజైన్‌లో ప్రచురితమైన కరింగుడి పోలీస్ స్టేషన్ అనే లఘు కథే ఈ సినిమాకు అసలు కథ అని చెబితే తప్పేమీ లేదు. ఈ కథను నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆడియో రూపంలో కూడా వినిపించాను అని పేర్కొన్నారు. అలాగే, 2022లో వచ్చిన భూతకాలం సినిమా లైన్ కూడా మూడేళ్ల క్రితం తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్న ఒక అనుభవం నుండి దొంగిలించిందేనని ఆమె ఆరోపించారు. చివరకు సినిమా టైటిల్ కూడా నా కథలాగే పెట్టారు. నేను నా కథకు భూత భవనం అని పేరు పెట్టాను అని శ్రీలేఖ రాసుకొచ్చారు.

ఎలాంటి సంబంధం లేదు

అయితే, ఈ ఆరోపణలను దృఢం సినిమా దర్శకుడు మార్టిన్ జోసెఫ్ పూర్తిగా తోసిపుచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమాకు, శ్రీలేఖ కథకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమా చూసిన ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. నేను మా స్క్రీన్‌రైటర్లు జోమన్ జాన్, లింటో దేవస్యలతో కూడా మాట్లాడాను. శ్రీలేఖ ఆ వీడియోను వారు ఇప్పుడే మొదటిసారి చూస్తున్నామని చెప్పారని దర్శకుడు వివరించారు.

ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన దృఢం సినిమా కథ విషయానికి వస్తే.. నటుడు షేన్ నిగమ్ పోషించిన ఒక కొత్త పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. కొండ ప్రాంతంలోని ఒక మారుమూల పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఆ కానిస్టేబుల్, అక్కడ జరిగే కొన్ని భయంకరమైన నేరాల వల్ల ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ. ఇక రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రేవతి, షేన్ నిగమ్ ముఖ్య పాత్రల్లో నటించిన భూతకాలం  సినిమా, మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక తల్లి, కొడుకు ఒక అద్దె ఇంట్లో ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొన్నారనే కథాంశంతో రూపొంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

Advertisment
తాజా కథనాలు