/rtv/media/media_files/2026/06/06/jhanvi-kapoor-2026-06-06-20-30-29.jpg)
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. అయితే, కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతున్నప్పటికీ, ఈ సినిమా ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన విధానం, కొన్ని రొమాంటిక్ సీన్లపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
సినిమాలో హీరోయిన్ అందాన్ని వర్ణించేటప్పుడు ఆమె ముఖాన్ని చూపించకుండా, కెమెరాను కేవలం ఆమె శరీర భాగాలపైనే జూమ్ చేస్తూ చూపించారని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఒక సీన్లలో కరెంట్ పోయినప్పుడు హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా హీరో బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడని, ఇది ముమ్మాటికీ వేధింపుల కిందకే వస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. విలన్లు చేస్తే తప్పు అయినప్పుడు, హీరోలు చేస్తే అది రొమాన్స్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
హీరోయిన్‌ను బ్లేమ్ చేయకండి
ఈ వివాదంపై టాలీవుడ్, శాండల్‌వుడ్ నటి ఆషికా రంగనాథ్ స్పందించింది. జాన్వీ కపూర్‌కు సపోర్ట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. "దయచేసి దీనికి హీరోయిన్‌ను బ్లేమ్ చేయకండి. తప్పు మన సిస్టమ్‌లో, ఇలాంటి సీన్లు ఉంటేనే సినిమా అమ్ముడవుతుందని నమ్మే మేకర్స్ లో ఉంది. నటీనటులు ఎప్పుడైనా తమకు వచ్చే అవకాశాలను బట్టి, పెద్ద సినిమాల్లో భాగం కావాలనే ఉద్దేశంతోనే నటిస్తారు. సినిమాలో హీరోయిన్ పాత్రను సరిగ్గా రాయకపోతే, ఆ తప్పు రైటర్స్, డైరెక్టర్లదే కానీ యాక్ట్ చేసిన మహిళలది కాదు" అంటూ ఆషికా గట్టిగా చెప్పుకొచ్చింది.
మరోవైపు ఈ వివాదం మరీ పెద్దది కావడంతో శనివారం ఉదయం డైరెక్టర్ బుచ్చిబాబు సన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. "ఒక ఫిల్మ్‌మేకర్‌గా సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికి, ఇన్‌స్పైర్ చేయడానికి ఉండాలని నేను నమ్ముతాను. అది ఎవరినీ ఇబ్బంది పెట్టేలా లేదా అవమానించేలా ఉండకూడదు. 'పెద్ది' సినిమాలోని కొన్ని సీన్లపై వస్తున్న విమర్శలను మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం. నాకు తెరపైనా, బయటా మహిళలంటే ఎంతో గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం మాకు లేదు. మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను" అని రాసుకొచ్చారు.
Follow Us