/rtv/media/media_files/2026/04/12/vishnu-2026-04-12-10-14-50.jpg)
యాంకర్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ సోషల్ మీడియా వివాదం ముదిరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం విజయవాడ సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే నగదు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని విష్ణుప్రియ ప్రచారం చేస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ ఆరోపించారు. టెలివిజన్ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఒక సెలబ్రిటీ, కేవలం డబ్బు కోసం ఇటువంటి అనైతిక పనులకు పాల్పడటం యువతపై తప్పుడు ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాసుల కోసం కక్కుర్తి
సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు, కాసుల కోసం కక్కుర్తి పడి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం సిగ్గుచేటని నాయకులు విమర్శించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ప్రధానంగా రెండు డిమాండ్లను ఉంచారు. అసభ్యకర ప్రచారానికి వేదికగా మారిన విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే నిలిపివేయాలని కోరారు. అంతేకాకుండా.. ఐటీ చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు దీపక్, సిద్దు, మనోజ్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజంలో నైతికతను పాడుచేసే ఇటువంటి ధోరణులను ఉపేక్షించబోమని, సెలబ్రిటీలు తమ పరిధి దాటి ప్రవర్తిస్తే న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
Follow Us