IND VS PAK: 17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై టీమిండియా.. కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది?

2025 ఫిబ్రవరిలో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాక్‌లో అడుగుపెట్టనుందన్న ప్రచారం జరుగుతోంది. పాక్‌ విడుదల చేసిన డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ ప్రకారం ఇండియా లాహోర్‌ వేదికగా ఆడాల్సి ఉంది. మరి భారత ప్రభుత్వం టీమిండియాను అనుమతిస్తుందో లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

New Update
IND VS PAK: 17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై టీమిండియా.. కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది?

Champions Trophy 2025 Schedule: అది నవంబర్ 26, 2008.. ఇండియా అంతా నిర్ఘాంతపోయింది. ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి ముంబై విలవిల్లాడింది. ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం పది మంది ఉగ్రవాదులు దేశ ఆర్ధిక రాజధానిలో మరణమృదంగం సృష్టించారు. 166 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన అది. ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్థాన్‌ ఉగ్రవాదులే కావడంతో ఆ దేశంతో దాదాపు అన్నీ సంబంధాలను ఇండియా తెగదెంపుకుంది. అందులో క్రికెట్‌ కూడా. నాటి ముంబై ఘటన తర్వాత భారత్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది లేదు.. అయితే రానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ జట్టు పాకిస్థాన్‌లోని లాహోర్‌ వేదికగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరి భారత్‌ క్రికెట్‌ బోర్డు ఏం చేయబోతుంది?

2008కు ముందు ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్ జట్ల మధ్య ఎక్కువగా బైలెటరల్‌ సీరిస్‌లు జరుగుతుండేవి. భారత్‌ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లి ఆడడం, పాక్‌ జట్టు ఇండియాలో ఆడడం సాధారణ విషయమే. అయితే 26/11 ముంబై దాడుల తర్వాత టీమిండియా పాక్‌లో అడుగుపెట్టలేదు. చివరిసారిగా 2007లో ఐదు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు భారత్‌జట్టు పాకిస్థాన్‌లో ప్రయాణించింది. ఇక 2012 డిసెంబర్‌లో పాక్‌ జట్టు ఇండియాలో పర్యటించింది. ఈ రెండు సీరిస్‌లు మినహా భారత్‌-పాక్‌ జట్లు తలపడ్డ ప్రతీసారి వేదిక న్యూట్రల్‌గా ఉండేది. అంటే ఇండియా, పాక్‌లో కాకుండా ఇతర దేశాల్లోని గ్రౌండ్స్‌లో రెండు జట్లు తలపడేవి.


2024 టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీపై కన్నేసింది. ఈ టోర్నీ షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌లో జరగాలి. ఇక షెడ్యూల్‌కు సంబంధించిన డ్రాఫ్ట్‌ కాపీని పాకిస్థాన్‌ రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌-లాహోర్ వేదికగా ఇండియా తన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 2025 మార్చి 1న పాకిస్థాన్‌తో ఇండియా తలపడాల్సి ఉంది. అయితే ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న బీసీసీఐ పాకిస్థాన్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌ల నిర్వాహణకు అనుమతిస్తుందా అన్నది డౌటే!

రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ టోర్నమెంట్ కోసం భారత్‌ పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్న. 2023లో ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో బీసీసీఐ తమ జట్టును పాక్‌కు పంపించేది లేదని చెప్పింది. దీంతో భారత్‌తో జరిగే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇలానే నిర్వహిస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. భారత్‌ జట్టు పాక్‌ ప్రయాణానికి సంబంధించిన తుది పిలుపును కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది.

అటు రాజకీయ కారణాలు మాత్రమే కాదు.. టీమిండియా భారత్‌లో అడుగుపెట్టకపోవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 2009లో పాక్‌లో పర్యటించిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. అప్పటినుంచి క్రికెట్‌ ఆడే ఇతర జట్లు సైతం పాక్‌లో ఆడేందుకు అంగీకరించడంలేదు. అటు ఆటగాళ్ల భద్రత అన్నిటికంటే ముఖ్యం. 2009 ఘటన తర్వాత చాలా ఏళ్ల పాటు ఏ జట్టు కూడా పాక్‌లో అడుగుపెట్టలేదు. 2015లో జింబాబ్వే, 2017లో వెస్టిండీస్‌ క్రికెట్‌ ఆడేందుకు పాకిస్థాన్‌ వచ్చాయి. భారీ భద్రత మధ్య ఈ మ్యాచ్‌లు జరిగాయి.

భారత్‌ ఆటగాళ్లకు పాక్‌లో ప్రయాణించడం చాలా పెద్ద రిస్క్‌. అటు బైలెటరల్‌ సీరిస్‌ల షెడ్యూల్, ఆతిథ్యంపై BCCI-పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. వేదికలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర కార్యాచరణ అంశాలపై ఇరు బోర్డులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదుల దాడుల కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు భారత్‌ జట్టును అనుమతిస్తుందా అన్నది డౌటే.

Also Read: Brahmamudi: ఇంట్లో మళ్ళీ అప్పు గురించి పంచాయతీ.. ధాన్యలక్ష్మికి కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు