LPG Cylinder Tips : సిలిండర్ 20 రోజులు అదనంగా రావాలా? ఈ 5 చిట్కాలు పాటిస్తే డబ్బు కూడా సేవ్!

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.

New Update
gas

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేసుకునే కాలాన్ని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచింది. అంటే, ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజుల సమయం ఉండాలి.

 ప్రజలు భయంతో సిలిండర్లను అడ్వాన్స్‌గా బుక్ చేసి నిల్వ చేయకుండా ఉండేందుకే చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే, కంగారు పడాల్సిన పనిలేదు.. మన వంటగదిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సిలిండర్ జీవితకాలాన్ని మరో 15 నుండి 20 రోజుల వరకు సులభంగా పెంచుకోవచ్చు.

వంట చేసేటప్పుడు మనం చేసే చిన్న తప్పులే గ్యాస్ వృధా కావడానికి కారణమవుతాయి. మొదటగా, గ్యాస్ బర్నర్, గిన్నె మధ్య దూరం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. గిన్నె మరీ ఎత్తులో ఉంటే అది వేడెక్కడానికి ఎక్కువ సమయం పట్టి, గ్యాస్ వృధా అవుతుంది. అలాగే, వంట చేసేటప్పుడు గిన్నెలపై మూత పెట్టడం చాలా ముఖ్యం. మూత పెట్టకుండా వంట చేస్తే లోపలి వేడి బయటకు పోయి ఆహారం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. మూత పెట్టడం వల్ల ఆవిరి లోపలే ఉండి త్వరగా వంట పూర్తవుతుంది.

వంటగదిలో గ్యాస్ ఆదా చేయడానికి ప్రెజర్ కుక్కర్ ఒక అద్భుతమైన ఆయుధం. పప్పులు, అన్నం లేదా కూరగాయలు ఉడకబెట్టడానికి కుక్కర్ వాడితే గ్యాస్ వినియోగం భారీగా తగ్గుతుంది. అయితే కుక్కర్ గ్యాస్కెట్, విజిల్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. చాలామంది గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు తరగడం లేదా మసాలాలు రెడీ చేయడం మొదలుపెడతారు. ఇది చాలా చెడ్డ అలవాటు. వంటకు కావాల్సినవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని, ఆ తర్వాతే స్టవ్ వెలిగిస్తే గ్యాస్ వృధా కాకుండా ఉంటుంది.

వండడానికి ముందు నానబెట్టాలి

బియ్యం, పప్పులను వండడానికి ముందు నానబెట్టాలి. వండడానికి ముందు వాటిని నానబెట్టడం వల్ల అవి వేగంగా ఉడకడానికి సహాయపడతాయి. దీనివల్ల సిలిండర్ ఆదా అవుతుంది. మనకు ఉన్న ఒక పెద్ద అలవాటు ఏమిటంటే ప్రతిదీ ఫ్రిజ్‌లో ఉంచడం. ఉదాహరణకు, పాలు. దానిని ఫ్రిజ్‌లో నుండి తీసి నేరుగా మరిగించవద్దు. అప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. చల్లదనం తగ్గే వరకు సమయం తీసుకొని, ఆపై వెచ్చగా ఉంచితే, అది వేగంగా ఉడకుతుంది.

చివరిగా, మీ గ్యాస్ స్టవ్ మంట పసుపు రంగులో వస్తున్నా లేదా తక్కువగా వస్తున్నా గ్యాస్ లీక్ అవుతుందని లేదా బర్నర్ సరిగ్గా లేదని అర్థం. క్రమం తప్పకుండా బర్నర్లను శుభ్రం చేయడం, రెగ్యులేటర్,  పైపులను తనిఖీ చేయించడం వల్ల గ్యాస్ పక్కదారి పట్టకుండా ఉంటుంది. ఈ ఐదు చిట్కాలు పాటిస్తే యుద్ధ టెన్షన్లు ఉన్నా, ఇంధన సంక్షోభం తలెత్తినా మీ సిలిండర్ మరో 15-నుంచి 20 రోజులు అదనంగా రావడం గ్యారంటీ. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా, కష్టకాలంలో చాలా తెలివిగా వ్యవహరించడం కూడా అవుతుంది.

Advertisment
తాజా కథనాలు