HBD KTR: నేడు కేటీఆర్ బర్త్ డే.. పాపం తొలిసారిగా సెలబ్రేషన్స్ ఇలా!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లుగా మంత్రిగా పుట్టిన రోజు జరుపుకున్న కేటీఆర్ నేడు తొలిసారిగా ఎమ్మెల్యేగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

New Update
HBD KTR: నేడు కేటీఆర్ బర్త్ డే.. పాపం తొలిసారిగా సెలబ్రేషన్స్ ఇలా!

BRS Working President KTR Birthday: అది 2009 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయం. తెలంగాణలో బీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు మహాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. అయితే.. సిరిసిల్ల (Sircilla) నుంచి అప్పటి వరకు అక్కడ పని చేసిన కేకే మహేందర్ రెడ్డిని కాదని కుమారుడు కేటీఆర్ ను బరిలోకి దించారు కేసీఆర్. దీంతో కేకే మహేందర్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు చేశారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. దీంతో తొలిసారి ఎన్నికల క్షేత్రంలో నిలిచిన కేటీఆర్ గెలుపు కష్టమేనన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నువ్వా? నేనా? అన్నట్లు జరిగిన ఆ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. కేటీఆర్ కు 36,783 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డికి 36,612 ఓట్లు వచ్చాయి. అయితే.. అప్పటి నుంచి కేటీఆర్ సిరిసిల్లలో వెనుదిరగలేదు.
publive-image

తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఏకంగా 50 వేలకు పైగా మెజార్టీ సాధించారు. సిరిసిల్లను తన కంచుకోటగా మార్చుకున్నారు. ఉమ్మడి ఏపీతో పాటు, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రత్యేక రాష్ట్ర రాజకీయాల్లోనూ తన స్థానం పదిలం చేసుకున్నారు. బీఆర్ఎస్ లో నంబర్ 2 స్థాయికి చేరుకున్నారు.

అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డ కేటీఆర్.. 2004 తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2006 కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన సమయంలో కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి తండ్రి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా మారారు. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. చక్కటి వాగ్ధాటి ఆయనకు కలిసొచ్చింది.

publive-image

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో విజయం సాధించిన కేటీఆర్ కు ఐటీ, పరిశ్రమలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు కేసీఆర్. ఐటీ హబ్ ఏర్పాటుతో పాటు అనేక అమెజాన్ లాంటి అనేక అగ్ర సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వెనక కేటీఆర్ కృషి ఉంది. 2014 ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ మినహా టీఆర్ఎస్ ఎక్కడా ఖాతా తెరవలేదు.
publive-image

అయినా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించేలా కేటీఆర్ చక్రం తిప్పారు. దీంతో పార్టీలో ఆయన ఇమేజ్ పెరిగిపోయింది. 2018 ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే కేటీఆర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ ప్రకటించారు. పార్టీలోనూ ఆయనకు ఆమోదం లభించింది. ఏ క్షణమైనా కేటీఆర్ సీఎం కావొచ్చన్న ప్రచారం సైతం సాగింది. కానీ కేసీఆర్ 2023 ఎన్నికల వరకు సీఎంగా కొనసాగారు. అయితే.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు అన్న టార్గెట్ తో బరిలోకి దిగిన టీఆర్ఎస్ కేవలం 9 సీట్లకే పరిమితం కావడం కేటీఆర్ కు కాస్త ఇబ్బంది కలిగించింది. అనంతరం వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సీట్లు తగ్గడం కూడా ఆయనను ఇబ్బంది పెట్టింది.
publive-image

దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం.. ఆ క్రమంలో అధికారం కోల్పోవడం కూడా కేటీఆర్ నాయకత్వానికి మచ్చను తెచ్చిపెట్టాయి. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించిన కేటీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. నిరుద్యోగులు, పార్టీకి దూరమైన వర్గాలతో స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపారు. చెరుకు సుధాకర్, ఏపూరి సోమన్న, దరువు ఎల్లన్న, మానవతారాయ్, పొన్నాల లక్ష్మయ్య లాంటి వారిని పార్టీలోకి తీసుకువచ్చి కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేసేలా వ్యూహం రచించారు కేటీఆర్. కానీ ఆయన వ్యూహాలు ఫలించలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.

2023లో బీఆర్ఎస్ పార్టీ మరో సారి అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం తప్పక అయ్యేవారన్న చర్చ కూడా పార్టీలో ఉంది. ఓటమి నుంచి కోలుకున్న కేటీఆర్.. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా శాయశక్తులను ఒడ్డుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీతో పాటు అనేక వేదికలపై తన గళం ఎత్తుతున్నారు.

కేటీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయా? బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం దక్కుతుందా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే.. నేడు 49 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేళ్లుగా మంత్రిగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న కేటీఆర్.. నేడు సాధారణ ఎమ్మెల్యేగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు