Seed balls : పర్యావరణ పరిరక్షణకు భారీ అడుగు: ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియ ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేశారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు.

New Update
FotoJet - 2026-06-05T135752.412

World Environment Day

Seed balls : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్ ఫ్లై పార్క్ వేదికగా శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అడవుల విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో తలపెట్టిన 2.5 కోట్ల సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారీ ప్రక్రియను ఆయన అధికారికంగా ప్రారంభించారు.

ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా.. స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. మన నేలలకు అలవాటైన అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి స్వదేశీ జాతులకు చెందిన మొక్కల విత్తనాలతో ఈ సీడ్ బాల్స్‌ను రూపొందించడం విశేషం. పర్యావరణంపై బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ఆయన, జూన్ 15వ తేదీ నాటికి నిర్దేశిత 2.5 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 కేంద్రాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. మూలపాడు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పవన్ కళ్యాణ్ నిశితంగా వీక్షించారు. అక్కడ పాల్గొంటున్న ప్రజలతో ముచ్చటించి, తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, మానవ రవాణాకు వీలుకాని కొండ కోనలు, అటవీ శిఖరాలపైకి డ్రోన్ల సహాయంతో ఈ విత్తన బంతులను అత్యంత ఆధునిక పద్ధతిలో వెదజల్లే సరికొత్త ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా బటర్ ఫ్లై పార్కులో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్స్‌ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. పార్కు నమూనాలో ఉన్న యోగా హాల్ నిర్మాణం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ప్రకృతి ఒడిలో యోగా అవసరమని భావించిన ఆయన.. రాష్ట్రంలోని ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్‌ను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా, స్థానిక చేతివృత్తులు, కొండపల్లి కొయ్య బొమ్మల కళాకారులకు ఉప ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. కొండపల్లి బొమ్మల తయారీకి వాడే తెల్లపొణికి దుంగలతో పాటు ఉదయగిరి కళాకారులు చెక్కతో చేసిన వాచ్, ల్యాప్ టాప్, వంటగది సామాగ్రిని ఆయన ఆసక్తిగా తిలకించారు. బొమ్మల తయారీకి చెక్క కొరత ఉందని కళాకారులు తెలపగా.. ప్రభుత్వం తరఫున 'వుడ్ బ్యాంక్' ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి ప్రతిమను కొయ్యతో తయారు చేయించాలని కోరారు. ఈ అద్భుతమైన కళారూపాలకు విస్తృత మార్కెటింగ్, ప్రచారం కల్పిస్తామని, ప్రతి రెండు నెలలకోసారి చేతివృత్తుల వారిని కలిసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు