Kakinada cracker factory blast : వేట్లపాలెంలో మృత్యు ఘోష..  కానీ వాళ్లు మాత్రం బతికిపోయారు.. ఎలాగంటే!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన ఒకవైపు పెను విషాదాన్ని నింపితే, మరోవైపు కొందరిని చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో బయటపడేసింది.

New Update
east godavari

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన ఒకవైపు పెను విషాదాన్ని నింపితే, మరోవైపు కొందరిని చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో బయటపడేసింది. ఈ భయంకరమైన ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, కొందరు కార్మికులు మాత్రం అదృష్టవశాత్తూ తృటిలో తప్పించుకున్నారు. దీనికంతటికీ కారణం వారు లంచ్ కు వెళ్లడమే.

నిజానికి ఆ సమయంలో ఫ్యాక్టరీలో పదుల సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నారు. అయితే సరిగ్గా పేలుడు జరగడానికి కొన్ని నిమిషాల ముందే కొందరు కార్మికులు లంచ్ చేయడం కోసం షెడ్ల నుంచి బయటకు వచ్చారు. ఒకవేళ వారు మరో మరికొన్ని నిమిషాలు ఆలస్యంగా భోజనానికి వెళ్లినా, లేదా అక్కడే కూర్చుని తిన్నా ఈరోజు వారి పరిస్థితి కూడా ఇతర బాధితుల్లాగే ఉండేది. ఆకలి తీర్చుకోవడానికి వెళ్లిన ఆ ముద్దే వారి ప్రాణాలను కాపాడింది. బతికి బయటపడిన ఆ కార్మికులు తమ కళ్ల ముందే తోటి వారు మంటల్లో కాలిపోవడం చూసి తల్లడిల్లిపోతున్నారు. 

ఇద్దరు కుమార్తెలు ఏడుపు 

ప్రమాదం జరిగిన చోట పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. తమ వారు ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు హాహాకారాలు చేస్తున్నారు. "మా అమ్మ నూకళ్ల దేవి కనిపించడం లేదు" అంటూ ఆమె ఇద్దరు కుమార్తెలు ఘటనా స్థలంలో ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. పేలుడులో మృతుల సంఖ్య 21కి చేరింది. చనిపోయిన వారిలో అత్యధికులు మహిళా కార్మికులే ఉండటం అందరినీ కలిచివేస్తోంది. పేలుడు ధాటికి గాయపడిన మరో 9 మంది పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగా ఉంది.

ఈ బాణాసంచా పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని ఆర్‌డీవో వెల్లడించారు. నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై  సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎ పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

Advertisment
తాజా కథనాలు