Pharma : ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్

విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది.కానీ డ్యూటీ తరువాత బయటకు వెళ్లినట్టు లేదు.

author-image
By Bhavana
New Update

Vizag : విశాఖ ఫార్మా సిటీలోని అడ్మిరాన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ పరిశ్రమలో పని చేస్తున్న ఓ ఉద్యోగి విధులకు వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుర్తి గ్రామానికి చెందిన సూర్యనారాయణ అడ్మిరాన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ లో ప్రొడక్షన్‌ మేనేజర్‌ గా పని చేస్తున్నాడు.

భార్య, పిల్లలతో కలిసి గాజువాకలో నివాసముంటున్నాడు. మంగళవారం కూడా జనరల్‌ షిఫ్ట్‌ విధులకు హాజరైన సూర్య సాయంత్రం ఐదు గంటల సమయంలో భార్యకు ఫోన్‌ చేసి, ఇంటికి బయలుదేరుతున్నట్టు చెప్పాడు. కానీ రాత్రి ఏడు గంటలు దాటినా సూర్యనారాయణ ఇంటికి రాలేదు. భార్య ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో ఆమె పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులకు ఫోన్‌ చేసి అడగగా, కంపెనీ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

కానీ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సూర్యనారాయణ భార్య, కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది. కానీ డ్యూటీ అనంతరం బయటకు వెళ్లినట్టు ఎక్కడా లేదు. అతని ద్విచక్ర వాహనం పార్కింగ్‌ స్థలంలోనే ఉంది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు… సూర్య ఏమయ్యాడంటూ కంపెనీ ప్రతినిధులను నిలదీశారు.

లోపల ఏదో ప్రమాదం…

ఈ క్రమంలో సూర్య భార్య బాల మాట్లాడుతూ, డ్యూటీ ముగిసిన తరువాత తన భర్త ఇంటికి రాలేదని, పరిశ్రమలో అడిగితే ఇంటికి వెళ్లిపోయాడని చెబుతున్నారని, లోపల ఏదో ప్రమాదం జరిగి ఉండొచ్చనని, ఆ విషయాన్ని యాజమాన్యం దాచిపెడుతుందని ఆరోపించారు. తన భర్తకు ఏదైనా హానీ జరిగితే యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.

పోలీసులకు ఫిర్యాదు…

సూర్య అదృశ్యంపై కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఆర్‌.మల్లికార్జునరావు ఫార్మా పరిశ్రమకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడారు. ఉద్యోగులను విడివిడిగా విచారించారు. సూర్య సంస్థలో ఎలా ఉండేవారు, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా వంటి విషయాల గురించి అడిగారు. కాగా సూర్యనారాయణ పరిశ్రమ నుంచి బయటకు వెళ్లినట్టు సీసీ ఫుటేజీలో రికార్డు కాకపోవడంతో అతను ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయి ఉంటాడని అక్కడి అధికారులు చెబుతున్నారు.

కానీ సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్న గోడను దూకే అవకాశం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఆడపిల్లను కిడ్నాప్‌ చేశారంటూ బెదిరింపు కాల్స్‌..జాగ్రత్త: సజ్జనార్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు