/rtv/media/media_files/2026/04/25/fotoje-0-2026-04-25-20-08-57.jpg)
MLA followers riot in Valmikipuram..attack on toll gate staff
MLA Surendra Babu : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ గేట్ సిబ్బందిపై వీరంగం సృష్టించిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యే వాహనాన్ని నిలిపివేసి, వెయిట్ చేయించారనే ఆగ్రహంతో ఆయన అనుచరులు, గన్‌మెన్ కలిసి టోల్ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు.
మహిళా సిబ్బందిపై అమానుషం
శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు వాహనం టోల్‌ప్లాజా వద్దకు చేరుకుంది. ఇతర వాహనాలు ముందు ఉండటంతో ఎమ్మెల్యే కారు వెళ్లడానికి కొంత సమయం పట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు "ఎమ్మెల్యే బండినే ఆపుతారా?" అంటూ లోపలికి దూసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న శ్రీలత ను మహిళా అని కూడా చూడకుండా, ఆమె జుట్టు పట్టుకుని లాగుతూ దారుణంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు సిసి టీవీ (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
మేనేజర్‌పై దాడి.. కారులో ఎత్తుకెళ్లి.
మహిళా సిబ్బందిపైనే కాకుండా, అక్కడే ఉన్న టోల్ ప్లాజా మేనేజర్ రవిపై కూడా ఎమ్మెల్యే అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం ఆయన్ని బలవంతంగా ఎమ్మెల్యే కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లడం గమనార్హం. ఎమ్మెల్యే గన్‌మెన్ సైతం టోల్ బ్యారియర్‌ను ధ్వంసం చేయడంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
బాధితుల వెనకడుగు - పోలీసుల మౌనం
దాడి జరిగిన తీరుపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. దాడికి గురైన మేనేజర్ రవి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎవరూ దాడి చేయలేదని చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే వాహనాన్ని పంపడంలో కొంత ఆలస్యం జరిగిందని, అంతా సర్దుకుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరుల ఒత్తిడి కారణంగానే బాధితులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, అందుకే రివర్స్‌లో వారే సారీ చెప్పే పరిస్థితి వచ్చిందని సమాచారం. వాల్మీకిపురం పోలీసులు కూడా తమకేమీ ఫిర్యాదు అందలేదని చెబుతూ ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
పునరావృతమవుతున్న వివాదాలు
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనంతపురంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో పిల్లలు ఆడుకునే విషయంలో గొడవ జరగగా, హరినాథ్ అనే ఏఆర్ కానిస్టేబుల్, ఆయన భార్య సుజాతపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా టోల్ ప్లాజా వద్ద మహిళా సిబ్బందిపై జరిగిన దాడితో ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార మదంతో మహిళలను కూడా చూడకుండా జుట్టు పట్టుకుని కొట్టడం దారుణమని విమర్శలు వస్తున్నాయి.
Follow Us