Fake milk : మీ ఇంట్లోని పాలు, నెయ్యి కల్తీవేమో ఇలా చెక్ చేసుకోండి!

ఉదాహరణకు ఒక పళ్లాన్ని ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కను వేసినప్పుడు, అది తెల్లటి ధారలా కిందకు దిగితే అవి స్వచ్ఛమైన పాలని అర్థం. అలా కాకుండా నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండానే వేగంగా కిందకు జారిపోతాయి.

New Update
fake milk

ఇటీవల రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటన తెలుగు రాష్ట్రాలనే కాదు ఏకంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వలన దాదాపుగా12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాలు అంటేనే జనాలు వణికిపోతున్నారు. ఏవీ కల్తీ పాలో తెలియక తాగడమే మానేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆహార భద్రత శాఖ అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ నీలకంఠారెడ్డి ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. పాలలో కల్తీని ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో ఎలా గుర్తించవచ్చో ఆయన వివరించారు.

తెల్లటి ధారలా కిందకు దిగితే

ఉదాహరణకు ఒక పళ్లాన్ని ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కను వేసినప్పుడు, అది తెల్లటి ధారలా కిందకు దిగితే అవి స్వచ్ఛమైన పాలని అర్థం. అలా కాకుండా నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండానే వేగంగా కిందకు జారిపోతాయి. కేవలం నీరు మాత్రమే కాకుండా పాలలో డిటర్జెంట్ లేదా యూరియా కలిపిందో లేదో తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. ఒక గ్లాసులో పది ML పాలు, అంతే సమానంగా నీరు పోసి బాగా కలిపినప్పుడు పైన మందపాటి నురుగు వస్తే అది కల్తీ జరిగినట్లు గుర్తు. 

అలాగే పాలు చిక్కగా కనిపించడం కోసం పిండి పదార్థాలు కలిపితే, వాటిలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం వేయగానే ఆ పాలు నీలం రంగులోకి మారిపోతాయి. రంగు మారకుండా ఉంటేనే అవి అసలైన పాలని గ్రహించాలి. ఇక నెయ్యి విషయానికి వస్తే, నెయ్యిలో బంగాళాదుంప లేదా ఇతర పిండి పదార్థాలు కలిపారో లేదో తెలుసుకోవడానికి కూడా అయోడిన్ ద్రావణం వాడవచ్చు. ఒక స్పూన్ నెయ్యిలో కొంచెం చక్కెర కలిపి వేడి చేసినప్పుడు అది ఎరుపు లేదా పింక్ రంగులోకి మారితే అందులో వనస్పతి కలిసినట్లు లెక్క.

అంతేకాకుండా ఒక గ్లాసు వేడి నీటిలో చెంచా నెయ్యి వేసినప్పుడు అది పైన తేలితేనే అది ఒరిజనల్ నెయ్యి అవుతుంది, లేదంటే అది చిన్న ఉండలుగా మారిపోతుంది. సహజమైన నెయ్యిని అరచేతిలో వేసి రుద్దితే మంచి సువాసన రావాలి, లేదంటే అది కల్తీ అని అనుమానించాలి. ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫుడ్ సేఫ్టీ శాఖ కరపత్రాలతో పాటుగా సోషల్ మీడియా ద్వారా భారీగా ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు మీకు తెలిస్తే వెంటనే 1800 425 3857 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా ఐపీఎం ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు