/rtv/media/media_files/2026/02/28/crackers-shops-2026-02-28-16-01-34.jpg)
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు వల్ల దాదాపు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 50 మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమైపోయాయి.
పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ షెడ్లు కుప్పకూలిపోయాయి. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి, వీరిలో పలువురి పరిస్థితి చాలా విషమంగా ఉంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను సీఎం ఆదేశించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండేళ్లలో వరుస ప్రమాదాలు
ఏపీలో గత రెండేళ్లలో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. కోనసీమ జిల్లాలో గతేడాది అంటే 2025 అక్టోబర్ లో రాయవరం మండలం వి. సావరం గ్రామంలోని లక్ష్మీ గణపతి బాణాసంచా యూనిట్లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీపావళి ఆర్డర్ల కోసం పని చేస్తున్న సమయంలో ఈ దారుణమైన ఘటన జరిగింది.
పేలుడులో 8 మంది కార్మికులు మృతి
ఇక2024లో అనకాపల్లి జిల్లాలో కైలాసపట్నం సమీపంలోని ఒక క్రాకర్స్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 8 మంది కార్మికులు మరణించారు. మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సంవత్సరం డిసెంబర్ లో తిరుపతి జిల్లాలో ఒక అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నిబంధనలు పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తేలింది. అటు ఏలూరు జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. బాణాసంచా నిల్వ ఉంచిన గదిలో మంటలు చెలరేగి జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Follow Us