/rtv/media/media_files/2024/11/04/0PlUEDu2HdCekEZM1bbx.jpg)
APSRTC
APSRTC : ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణ, డీజిల్ వినియోగం తగ్గించడం,ఇంధన పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2030 నాటికి పల్లె వెలుగు బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడిపించాలని ఒక దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను, జాతీయ విధానాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఈ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది (2026) చివరి నాటికి రాష్ట్రంలోని 12 ముఖ్య నగరాలు/ప్రాంతాలలో విద్యుత్ బస్సులను రోడ్లపైకి తీసుకురానున్నారు. మొత్తం రెండు విడతల్లో భాగంగా తొలి విడతలో 1,050 బస్సులు, రెండో విడతలో 1,450 బస్సులను సమకూర్చనున్నారు. పుణెకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఆపరేటర్ సంస్థ 'ఫినాకిల్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా ఈ బస్సుల నిర్వహణ (ఆపరేషన్స్) సాగనుంది. ఈ కొత్త బస్సుల రాకతో ప్రయాణికులకు మరింత మెరుగైన, ఆధునిక సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో నెలకొన్న బస్సుల కొరతను అధిగమించడానికి ఏపీఎస్‌ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మూడు వేర్వేరు పథకాల కింద బస్సులను కేటాయించాలని కోరింది. దీనికి కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. 'పీఎం ఈ-బస్' పథకం కింద రాష్ట్రానికి ఇప్పటికే 750 బస్సులు మంజూరు కాగా, 'మహువా' (కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) పథకం ద్వారా మరో 300 బస్సులు సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు 'పూర్వోదయ' స్కీమ్ కింద మరో 1,450 బస్సుల ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్రం నుంచి రానున్న మొత్తం 2,500 విద్యుత్ బస్సులను రాష్ట్రంలోని 12 ప్రధాన డిపోలకు విభజించి కేటాయించారు. అత్యధికంగా తిరుపతికి 350 బస్సులు (అలిపిరి, తిరుమల, మంగళం డిపోలు) కేటాయించగా, గుంటూరు-2 డిపోకు 100, నెల్లూరు-2 డిపోకు 100, విజయవాడ (విద్యాధరపురం)కు 100, విశాఖపట్నం (గాజువాక)కు 100 బస్సుల చొప్పున కేటాయించారు. అలాగే అమరావతి (మంగళగిరి), అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు 50 బస్సుల చొప్పున కేటాయించి కార్యకలాపాలు సాగించనున్నారు.
ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ తీవ్రమైన అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. కాలం చెల్లిన బస్సులను మార్చలేక, అవసరమైన సిబ్బంది కొరతను అధిగమించలేక సంస్థ ఇబ్బందులు పడుతోంది. దీనికి తోడు 'స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సేవలు అందించడం సంస్థకు భారంగా మారిన నేపథ్యంలో, కేంద్రం ఇచ్చే సబ్సిడీ అవకాశాన్ని వాడుకుని ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడాలని ప్రభుత్వం చూస్తోంది.
విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ఎంపిక చేసిన 12 డిపోలలో ఒక్కో డిపోకు రూ.16 కోట్ల చొప్పున భారీ ఖర్చుతో అంతరాయం లేని చార్జింగ్ స్టేషన్లు, సర్వీసింగ్ వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 5 కీలక డిపోలను ఫినాకిల్ సంస్థకు అప్పగించగా, మిగిలిన 7 డిపోలలో ఆర్టీసీకి 50 శాతం భాగస్వామ్యం ఉంటుంది. ఒప్పందం ప్రకారం ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి కిలోమీటరుకు ఈ-బస్ యజమానికి ఆర్టీసీ రూ.72 అద్దె చెల్లించాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.24 భరిస్తుండగా, మిగిలిన రూ.48 మొత్తాన్ని ఆర్టీసీ చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ అడుగులు వేగంగా పడుతున్నప్పటికీ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ (JAC) నేతలు ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాము విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదని చెప్తూనే, ఈ ప్రక్రియ అంతా పరోక్షంగా సంస్థను ప్రైవేటీకరించడమేనని ఆరోపిస్తున్నారు. డిపోల స్థలాలు ఆర్టీసీవి, చార్జింగ్ స్టేషన్లు కట్టేది ఆర్టీసీ, ప్రయాణికులకు సేవలు అందించేది ఆర్టీసీ అయినప్పుడు.. కేంద్ర సబ్సిడీని, కిలోమీటర్ల అద్దెను ప్రైవేట్ ఆపరేటర్లకు ఎందుకు ఇస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు సేవల్లో విఫలమైతే ప్రజల్లో ఆర్టీసీపైనే వ్యతిరేకత వస్తుందని, పైగా పల్లెవెలుగు బస్సుల్లో ఉండే 55 సీట్ల స్థానంలో కేవలం 25-35 సీట్లు ఉండే ఈ-బస్సులు పెరిగిన రద్దీకి సరిపోవని జేఏసీ నేతలు వాదిస్తున్నారు.
మరోవైపు ఉద్యోగ సంఘాల ఆందోళనలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు , ప్రైవేట్ ఆపరేటర్ సంస్థ తమ వాదనను స్పష్టం చేశారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలుకు రూ.కోటికి పైగా ఖర్చవుతుందని, డ్రైవర్ల జీతాలు, బస్ మెయింటెనెన్స్, బ్యాటరీ లైఫ్ వంటి భారీ పెట్టుబడి బాధ్యతలన్నీ ప్రైవేట్ సంస్థే చూసుకుంటుందని తెలిపారు. ప్రతి నెలా సిబ్బంది జీతాలకే రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్న తరుణంలో, ఆర్టీసీ సొంతంగా వందల కోట్లు పెట్టి ఈ-బస్సులు కొనే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇది సంస్థకు ఆర్థికంగా భారం కాదని, కేంద్ర విధానాల ప్రకారమే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకుంటోంది.
Follow Us