ఏలూరు MP పుట్టా మహేష్‌కు TDP షాక్.. పార్టీ కార్యక్రమాల నుంచి బహిష్కరణ

మొయినాబాద్ ఫాంహౌస్‌లో శనివారం జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంపీ పుట్టా మహేష్ పేరు వినిపించడం, ఆయనకు బ్లడ్ టెస్టుల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రావడంతో పార్టీ దీన్ని సీరియస్‌గా తీసుకుంది.

New Update
_Eluru MP Putta Mahesh

ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్‌పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు తీసుకుంది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంపీ పుట్టా మహేష్ పేరు వినిపించడం, ఆయనకు బ్లడ్ టెస్టుల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పార్టీ దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం అధికారికంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను, ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలను పార్టీ అత్యంత సీరియస్‌గా తీసుకుంది" అని నోటీసులో పేర్కొన్నారు.

ఐదు రోజుల్లోగా వివరణకు ఆదేశం
ఈ ఘటనపై పూర్తి స్థాయి లిఖితపూర్వక వివరణను 5 రోజుల్లోగా పార్టీ కార్యాలయానికి అందజేయాలని ఎంపీ మహేష్‌ను ఆదేశించారు. అప్పటి వరకు ఆయన ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, పార్టీకి దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం మరియు పోలీసుల నుంచి సమగ్ర నివేదిక అందే వరకు ఆయనపై సస్పెన్షన్ తరహా ఆంక్షలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సీఎం చంద్రబాబు ఫైర్
ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. "డ్రగ్స్ వంటి సామాజిక మహమ్మారి విషయంలో ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోంది. ఇలాంటి తరుణంలో పార్టీకి చెందిన వారే ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం క్షమించరానిది. వ్యక్తుల వ్యక్తిగత బలహీనతలు, తప్పుల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదు" అని ఆయన స్పష్టం చేశారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని అధిష్టానం హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు