/rtv/media/media_files/2025/03/10/KObp1TNcFWqKDnnCJ6o9.jpg)
Pitapuram SVSN Varma
ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ స్పందించారు. పార్టీ నిర్ణయానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. గత ఎన్నికల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా ఇంటింటికీ ప్రచారం చేసి కూటమి అభ్యర్థిని గెలిపించమే ఇందుకు నిదర్శనమన్నారు. 30 ఏళ్లుగా చంద్రబాబుతో తన ప్రయాణం సాగుతోందన్నారు. ప్రజా సేవ చేయడానికి ఇచ్చే అవకాశమే గొప్ప పదవి అని అన్నారు.
ఇది టిడిపి అంటే.. నిజమైన నాయకులకు, గ్రౌండ్ లో పని చేసే కార్యకర్తలకు ఉండే క్రమశిక్షణ ఇది.. చంద్రబాబు గారి నిర్ణయాన్ని శిరసావహిస్తూ, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అర్ధం చేసుకుని, తన నిబద్ధత చాటుకున్న వర్మ గారు. 🙏 #AndhraPradesh #TDPMLCCandidates pic.twitter.com/T9ChU01Ydb
— anigalla🇮🇳 (@anigalla) March 10, 2025
పార్టీ కోసం ప్రాణాలు అర్పిస్తాం..
పార్టీని కాపాడుకుంటామని, కార్యకర్తలపై ఈగ వాలినా ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఒక జడ్పీటీసీ పదవి ఇవ్వడానికే మల్లగుల్లాలు పడుతూ ఉంటామన్నారు. రాష్ట్ర స్థాయిలో పదవులు పంపకం చేసే సమయంలో అధ్యక్షుడికి అనేక ఇబ్బందులు ఉంటాయన్నారు. అనేక సమీకరణలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.
పవన్ కోసం టికెట్ త్యాగం..
పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. పొత్తుల్లో భాగంగా కూటమి నుంచి ఆ సీటు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ విజయం కోసం వర్మ అక్కడ పని చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మకు టీడీపీ హైకమాండ్ ఆ సమయంలో హామీ ఇచ్చింది. ఇటీవల ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో వర్మకు పక్కాగా ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ పార్టీ విడుదల చేసిన లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీపై ఆయన తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. కానీ ఆ వార్తలకు తెరదించుతూ.. చంద్రబాబు నిర్ణయానికి కట్టబడి ఉంటానని ప్రకటించారు.