/rtv/media/media_files/2026/06/13/dog-2026-06-13-19-44-24.jpg)
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) మిస్సింగ్ కేసు ఇప్పుడు మరింత మిస్టరీగా, అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క హఠాత్తుగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
గత శనివారం చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయినప్పుడు, ఆమె వెంట ఈ పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. నాలుగు రోజుల పాటు ఎక్కడా కనిపించని ఆ కుక్క, ఆ తర్వాత ఒక్కటే ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి అది చాలా భయపడుతూ, వింతగా ప్రవర్తించింది.
చిన్నారి ఎక్కడుందో తెలుసుకోవడానికి పోలీసులు ఆ కుక్కకు ఒక ట్రాకర్ అమర్చారు. ఆ తర్వాత అది కేవలం గంటన్నర లోపే దాదాపు 8 కిలోమీటర్ల దూరం వేగంగా పరిగెత్తింది. చిన్నారి ఉన్న చోటికే కుక్క వెళ్తుందని పోలీసులు భావిస్తున్న సమయంలోనే, అది ఒక్కసారిగా కిందపడి ప్రాణాలు విడిచింది.
తినకపోవడం వల్లే
నిన్నటి నుంచి కుక్క తిండి తినకపోవడం వల్లే నీరసించి చనిపోయిందని అధికారులు చెబుతున్నారు. కానీ, చిన్నారి కనిపించకుండా పోయిన బాధతోనే అది అన్నం తినలేదని కొందరు వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా, గత నాలుగు రోజుల్లో ఆ కుక్క ఏదైనా భయంకరమైన సంఘటనను చూసి ఉండవచ్చని, ఆ భయంతోనే అది చనిపోయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు.
కుక్క చనిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కుక్క చివరి నిమిషంలో పరిగెత్తిన ఆ 8 కిలోమీటర్ల ప్రాంతంలో పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు.
Follow Us