/rtv/media/media_files/2026/05/26/fotojet-11-2026-05-26-14-53-24.jpg)
Nageshwar.. Pawan Kalyan
BIG BREAKING: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన కేసు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన ఈ ఇష్యూపై మాట్లాడుతూ... ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, ఆ విషయాన్ని అక్కడితో వదిలేయాలని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్ల తనకున్న గౌరవాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చాటుకున్నారు. "ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సీనియర్ విశ్లేషకులు. విశ్లేషణలు చేసే క్రమంలో కొన్నిసార్లు సీనియర్లు కూడా పొరపాటున మాట జారే అవకాశం ఉంది. ఆయన ఏదో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు. అంతమాత్రానికే ఆయనపై కేసులు పెట్టడం సరికాదు" అని పవన్ అభిప్రాయపడ్డారు.
నాగేశ్వర్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కోసం తెలంగాణకు కూడా వెళ్లారని తనకు తెలిసిందని పేర్కొన్న పవన్... "మనవాళ్లు (కూటమి శ్రేణులు/పోలీసులు) ఆయనపై కేసులు పెట్టారు. కానీ నేనే స్వయంగా జోక్యం చేసుకుని, ఆ కేసు వద్దు, ఆయన్ని వదిలేయమని చెప్పాను" అని వెల్లడించారు. సీనియర్ల పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే కేసు ఉపసంహరణకు తాను మొగ్గు చూపినట్లు ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది.
విమర్శల పేరిట దాడి చేస్తే ఊరుకోం: వెబ్‌సైట్లకు పవన్ హెచ్చరిక
ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్... అదే సమయంలో తనపై, ప్రభుత్వంపై డిజిటల్ మీడియాలో వస్తున్న మితిమీరిన ట్రోలింగ్, కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు విశ్లేషిస్తూ కూడా తప్పుడు పద్ధతిలో నన్ను తిడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా కొన్ని వెబ్‌సైట్లను ఉద్దేశించి పవన్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు: ఉద్దేశపూర్వక దాడి: "కొన్ని వెబ్‌సైట్లు నాపై పదేపదే, కావాలనే ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి."సహించేది లేదు: "ఇకపై ఎవరు పడితే వారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడిపోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు." "నాపై కావాలనే వ్యక్తిగత దాడికి దిగుతున్న వెబ్‌సైట్లపై, నిర్వాహకులపై తోలు తీసే విధంగా అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి."
ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరిస్తాం కానీ, విమర్శల ముసుగులో కావాలనే అజెండాతో దాడి చేసే వారిని మాత్రం వదిలిపెట్టేది లేదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గట్టి సందేశం ఇచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి సీనియర్ల పొరపాట్లను పెద్ద మనసుతో క్షమించాలని చెబుతూనే, హద్దులు దాటి ప్రవర్తించే వెబ్‌సైట్లకు గట్టి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Follow Us