గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి.. కేవలం 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. వివిధ విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా పార్టీలో అత్యంత కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ నూతన కమిటీని ప్రకటించారు. మొత్తం 33 మందికి ఈ కమిటీలో చోటు కల్పించారు. తమ్మినేని సీతారాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజిని, నందిగం సురేష్, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, రోజా, అవినాష్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాకే శైలజానాథ్ కు ఈ కమిటీలో చోటు దక్కింది. పార్టీ రీజినల్ కో-ఆర్డినటర్లు పీఏసీ (పొలిటికల్ అడ్వైజరీ కమిటీ)కి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. పీఏపీ కో-ఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తారని వెల్లడించారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డికి మరోసారి జగన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం అవుతోంది.
వైయస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా 33 మందిని నియమించిన పార్టీ అధ్యక్షులు @ysjagan గారు. pic.twitter.com/toirUMnlq4
— YSR Congress Party (@YSRCParty) April 12, 2025
ఎన్నికల్లో ఘోర పరాజయానికి సజ్జలే కారణమని అనేక మంది నేతలు బహిరంగంగానే కామెంట్ చేసిన విషయం తెలిసిందే. సీఎంకు తప్పుడు సలహాలు ఇచ్చారని.. కనీసం ఎమ్మెల్యేలను కూడా జగన్ ను కలవకుండా ఆయన అడ్డుపడ్డారన్న విమర్శలు కూడా ఉన్నాయి. విజయసాయిరెడ్డి లాంటి వారు కూడా సజ్జల కారణంగానే పార్టీని వీడారన్న చర్చ ఉంది. దీంతో సజ్జలను జగన్ పక్కన పెడతారన్న ప్రచారం సాగింది. ఢిల్లీలో జగన్ ధర్నా చేసిన సమయంలో సజ్జలను పట్టించుకోలేదని.. పక్కన పెట్టారన్న వార్తలు సైతం వచ్చాయి.
వారికి దక్కని చోటు..
అయితే.. తాజాగా సజ్జలను పార్టీలో అత్యంత కీలకమైన పీఏసీ కో-ఆర్డినేటర్ గా నియమించడంతో ఆ ఊహాగానాలకు బ్రేక్ పడింది. సజ్జల సలహాలతోనే జగన్ మరోసారి ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టమైంది. ఇదిలా ఉంటే.. పుష్పా శ్రీవాణి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తదితర నేతలకు పీఏసీలో చోటు దక్కకపోవడంతో వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కారణంగా పార్టీకి నష్టం జరిగిందో వారినే మళ్లీ నియమించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
(telugu-news | latest-telugu-news | telugu breaking news)