Anna Lezhneva : పవన్ కల్యాణ్‌ను చూస్తే గర్వంగా ఉంది..  అన్నా లెజినోవా ఎమోషనల్ కామెంట్స్!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.

New Update
anna

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. పవన్ కల్యాణ్, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ, ఆయన రాజకీయ ప్రస్థానంలో తాము అనుభవించిన గుండెకోతను, ఒంటరితనాన్ని మొదటిసారి అందరితో పంచుకున్నారు.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న ప్రయాణం అంత సులభంగా సాగలేదని అన్నా లెజినోవా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ చారిత్రాత్మక విజయం సాధించి ఉండవచ్చు కానీ, అంతకుముందు పవన్ ఎన్నో ఓటములను, అవమానాలను చవిచూశారని గుర్తుచేశారు. ప్రజలకు కేవలం విజయం, చిరునవ్వులు, సంబరాలు, వార్తా పత్రికల హెడ్‌లైన్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ వీటి వెనుక ఏళ్ల తరబడి సాగిన పోరాటం, అలసట, అవమానాలు, అనిశ్చితిని చాలా తక్కువ మంది మాత్రమే గమనిస్తారు. ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకంగా నిలబడినట్లు అనిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఆయన్ను తీవ్రంగా అవమానించారు, ఎగతాళి చేశారు, రకరకాల పేర్లతో దూషించారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ సమాజం కోసం, తన సిద్ధాంతాల కోసం బయట ఒంటరి పోరాటం చేస్తుంటే.. తాను ఇంట్లో పిల్లల కోసం ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించేదాన్నని అన్నా చెప్పారు. "ఆ సమయంలో నేను కూడా ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాను. కొన్ని రోజులు తీవ్రంగా కుంగిపోయాను, భయపడ్డాను. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఒక వ్యక్తి ఇంకెంత కాలం, ఎంతగా భరించగలడని ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. అయినా మేము వెనకడుగు వేయకుండా ముందుకు సాగాము. అలా ముందుకు సాగడం వల్ల మా జీవితం లగ్జరీగా మారుతుందని కాదు.. కేవలం కొందరు వ్యక్తులు తమ అంతరాత్మను ఎప్పటికీ వంచించుకోలేరు, పవన్ అలాంటి వ్యక్తి" అని ఆమె స్పష్టం చేశారు.

అవి బాధతో వచ్చినవి కావు

2024 ఎన్నికల విజయం తనకు కేవలం ఒక రాజకీయ విజయంగా అనిపించలేదని, అది ఒక అద్భుతమైన మానవతా విజయమని అన్నా లెజినోవా అభివర్ణించారు. ఏళ్ల తరబడి తాము అనుభవించిన గుండెకోత, వేదన అంతా ఆ ఒక్క విజయంతో అంతులేని ఆనందంగా మారిపోయిందన్నారు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కళ్లల్లో నీళ్లతో తాను నిలబడిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. అక్కడ నా కళ్లలో వచ్చిన నీళ్లను ప్రధాని నరేంద్ర మోదీ కూడా గమనించారు. అవి బాధతో వచ్చినవి కావు.. స్వచ్ఛమైన సంతోషానికి నిదర్శనమైన ఆనందబాష్పాలు. ఎందుకంటే, కొన్నిసార్లు దేవుడు మనుషులను ఎంతో కఠినంగా పరీక్షిస్తాడు, కుంగిపోయేలా చేస్తాడు. 

కానీ, చివరికి అదే ప్రపంచం ముందు వారి గౌరవాన్ని అంతకంతకూ రెట్టింపు చేసి సగర్వంగా తిరిగి ఇస్తాడు. ఆ అద్భుత క్షణంలో ఓటమిని ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడని ఆ వ్యక్తిని చూసి నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది పవన్ కల్యాణ్ అంటూ అన్నా లెజినోవా తన మనసులోని మాటలను ఎంతో ఎమోషనల్‌గా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

Advertisment
తాజా కథనాలు