/rtv/media/media_files/2026/05/20/abhinay-darshan-2026-05-20-21-28-59.jpg)
Abhinay Darshan
Abhinay Darshan : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై 'హత్యాయత్నం' కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ దాడి ఘటన ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆడిన హైడ్రామా అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సంచలన నిజాలను వెల్లడించారు. అభినయ్ అసలు పాస్టరే కాదని, కేవలం ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి, రాజకీయంగా ప్రచారం పొందడానికి తనపై తనే మనుషులను పెట్టి దాడి చేయించుకున్నాడని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కుట్రకు సంబంధించి పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
అల్లూరి జిల్లా జీకే వీధి మండలం నీరుతోటపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన అభినయ్ దర్శన్, సమాజంలో విపరీతమైన పాపులారిటీ సంపాదించాలనే వికృత ఆలోచనతో ఈ డ్రామాకు తెరలేపాడు. ఎవరూ వెంటనే స్పందించకుండా, ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేని 'నో నెట్‌వర్క్' ప్రాంతాన్ని ఎంచుకుని తనపై దాడి చేయించుకున్నాడు. ఆ దాడికి సంబంధించిన వీడియోలను ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ చేసి, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించాడని ఎస్పీ అమిత్ బర్దార్ వివరించారు.ఈ నకిలీ దాడి వెనుక కేవలం వ్యక్తిగత ప్రచారమే కాకుండా, సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయంగా ఉద్రిక్తతలు సృష్టించడం వంటి ప్రమాదకరమైన లక్ష్యాలు కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణమైన కుట్రకు పాల్పడినందుకు గాను పోలీసులు అభినయ్ దర్శన్‌తో పాటు బిల్లా కిరణ్ అలియాస్ కిరణ్ జార్జ్, కె. బెంజమిన్ భాను ప్రసాద్‌లను ప్రధాన కుట్రదారులుగా గుర్తిస్తూ వారిపై కేసు నమోదు చేశారు.
దాడిలో పాల్గొన్న నిందితులు వీరే:
అభినయ్ దర్శన్ ఇచ్చిన సుపారీ లేదా ప్లాన్ ప్రకారం నేరుగా దాడిలో పాల్గొన్న తంగుల వసంత్ కుమార్, కుమడ ప్రేమ్‌కుమార్, తంగుల సత్యరాజు, కిండంగి ఇంద్రకుమార్‌లను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ సంచలన కేసులో ఇంకా మరికొంతమంది కీలక వ్యక్తుల పాత్ర ఉండే అవకాశం ఉందని, దీనిపై పూర్తి స్థాయి లోతైన విచారణ జరుపుతున్నామని ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు. ప్రచారం కోసం, మతపరమైన శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి డ్రామాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
Follow Us