Amaravati Present Situation: అమరావతి ఇప్పుడెలా ఉంది? నిర్మాణాలు పనికి వస్తాయా? అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారిపోయింది. రాజధాని కల ముక్కలైపోయింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి పనులు వేగంగా అవుతాయని అంటున్నారు. అసలిప్పుడు అమరావతి ఎలా ఉంది? ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By KVD Varma 11 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Amaravati Present Situation: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కొలువుతీరిన చంద్రబాబు నాయుడు సర్కారు రాజధాని నగర ఏర్పాటు కోసం 2014లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నగరాన్ని అమరావతి పేరుతో అభివృద్ధి చేయాలని భావించింది. రాజధాని నగరం 217.23 చ.కి.మీ. (83.87 చ.మై. ) విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించారు. అందులో సీడ్ క్యాపిటల్ 16.94 చ.కి.మీ. (6.54 చ.మై.) విస్తీర్ణంలో ఉంటుందని చెప్పారు. దీనిలో మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి లోని 31 గ్రామాలు ఉన్నాయి. అమరావతి విజయవాడ నగరానికి నైరుతి దిశలో 12 కి.మీ (7.5 మైళ్లు), గుంటూరు నగరం ఉత్తరదిశలో 24 కి.మీ. (15 మై.) దూరములో ఏర్పాటు చేయాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భావించింది. కొత్త రాజధానికి భూసేకరణ కొత్త తరహాలో అంటే, ప్రధానంగా అభివృద్ధిపరచిన నగరంలో ప్లాట్లు ఇచ్చేటట్లుగా రైతులతో ఒప్పందం చేసుకునేట్లు జరిగింది. అమరావతి కోసం 60 రోజులలో 25,000 రైతులనుండి 30,000 ఎకరాలను (121.40 చ.కిమీ.) సమీకరించారు. భారత ప్రధాని నరేంద్రమోడి ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబరు 22 విజయదశమి నాడు శిలాన్యాసం (శంకుస్థాపన) చేసారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా భవన సముదాయానికి 2016 అక్టోబరు 28 వ తేదిన అప్పటి కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి, ఎం. వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేసారు. 2016 జనవరి నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంకుస్థాపన చేసారు. 2015 జూన్ నాటికి పరిపాలన అక్కడి నుంచి సాగించాలని భావించినా అది అక్టోబరు నాటికి సాకారమయింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది. అమరావతి పనులు ఎంతవరకూ అయ్యాయి.. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ముందుగా తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ సిద్ధం చేశారు. అక్కడ 2017 నుంచి పాలన అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత తాత్కాలిక హైకోర్టు సిద్ధం చేశారు. ఇక్కడ 2019 నుంచి కార్యకలాపాలు మొదలు అయ్యాయి. సాధారణ పరిపాలన మొదలైన తరువాత శాశ్వత వసతి కోసం నిర్మాణ పనులు మొదలు పెట్టారు. వీటిలో ముందుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు ప్రారంభించారు. వీటి నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తి అయింది. ఫినిషింగ్ స్టేజికి దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన కట్టడాలు కూడా 90 శతం పూర్తి అయ్యాయి. ఇక గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగుల కోసం క్వార్టర్స్ పనులు దాదాపు సగం వరకూ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. అలాగే జడ్జి క్వార్టర్స్ పనులను కూడా మొదలు పెట్టారు. రోడ్లు.. సీడ్ క్యాపిటల్.. ఇక క్యాపిటల్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చారు. ముందుగా రోడ్లను పూర్తిచేయాలని పనులు వేగంగా మొదలు పెట్టారు. ఆరు లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి పరిధిలో దాదాపుగా పూర్తి అయింది. దీనిని నేషనల్ హైవే 16 తో కలిపే వరకూ 5 కిలోమీటర్ల రహదారి మాత్రమే మిగిలి ఉంది. అంతర్గత రహదారులు కూడా చాలావరకూ పనులు మొదలు అయ్యాయి. అలాగే నీటిని సరఫరా చేసేందుకు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం పనులు కూడా మొదలు పెట్టారు. సుమారు నిలువెత్తు వ్యాసంతో ఉన్న పైప్ లైన్స్ భూగర్భంలో ఏర్పాటు చేశారు. దాదాపు 30 శాతం వరకూ ఈ పని పూర్తికాగా.. దీనికి సంబంధించిన పైపులు చాలావరకూ సేకరించి ఉంచారు. సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ఐకానిక్ బిల్డింగ్ గా.. అదేవిధంగా నిర్మాణం పూర్తైన తరువాత ప్రపంచంలోనే అతి పెద్ద.. అందమైన సెక్రటేరియేట్ గా పేరుతెచ్చుకుంటుందని చెప్పిన 50 అంతస్తుల భవన నిర్మాణానికి పునాదులు పూర్తి అయ్యాయి. ఇక్కడ మొత్తం మూడు టవర్స్ వస్తాయి. వాటిలో రెండు 42 అంతస్తులు ఉంటాయి. సీడ్ క్యాపిటల్ లో ఇవి ఐకానిక్ బిల్డింగ్స్ గా ఉంటాయిని మాస్టర్ ప్లాన్ లో చెప్పారు. ఇవే కాకుండా చాలా పనులను ప్రారంభించారు. కొన్ని పునాదుల దశలో ఉంటే మరికొన్ని, పిల్లర్స్ స్టేజిలో.. ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలో ప్రభుత్వం మారింది. తరువాత పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తిరిగి పనులు ప్రారంభం అవుతాయని భావించారు. కానీ, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల రాగం ఎత్తుకోవడంతో నాలుగున్నరెళ్ళుగా ఈ సగం సగం పూర్తయిన పనులు అలానే నిలిచిపోయాయి. కొన్నిరోజులు ఎదురుచూసిన కాంట్రాక్టర్లు కూడా అక్కడ నుంచి చాలావరకూ బయటకు వెళ్లిపోయారు. అధికారులు ఏమన్నారు? మొత్తం 270 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నగరం నిర్మిస్తున్నారు. పార్కులు, సామూహిక అవసరాల కోసం అందులో 30 శాతం భూములు కేటాయించారు. రోడ్లు 1,600 కిలోమీటర్ల పొడవున నిర్మించే ప్రతిపాదన చేశారు. పనులు ఆగిపోయేనాటికి రూ.36,960 కోట్ల విలువైన పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్నవి పూర్తయితే మొత్తం 77 శాతం పనులు పూర్తవుతాయని సీఆర్డీయే అధికారులు అప్పట్లో వెల్లడించారు. అంతేకాకుండా తొలి దశ పనుల్లో రోడ్ల నిర్మాణం కోసం మొత్తం 12,986 కోట్లు, ప్రభుత్వ భవనాలు, గృహాల కోసం రూ. 5,883 కోట్లు, భూసమీకరణ కోసం రూ.12,545 కోట్లు వెచ్చిస్తున్నట్లు అధికారులు గతంలో వివిధ సందర్భాల్లో వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? దాదాపు నాలుగున్నరేళ్లుగా పట్టించుకునే నాధుడు లేక.. సగం సగం పనులతో మిగిలిపోయిన అమరావతి నిర్మాణాల చుట్టూ ముళ్లపొదలు పెరిగిపోయి… కొన్ని పునాదుల్లో వర్షపు నీరు నిలిచిపోయి.. ముఖ్యంగా ఐకానిక్ బిల్డింగ్స్ పునాదులు నీటిలో చిక్కుకుపోయి ఉన్నాయి. కనీసం రోడ్డు నుంచి ఆ పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవడానికి కూడా అవకాశం లేకుండా ముళ్లపొదలు ఆవరించి ఉన్నాయి. నాలుగున్నరేళ్ల కాలంలో పట్టించుకోకుండా వదిలేయడంతో నిర్మాణంలో ఉన్న భవనాలు శిధిలావస్థలోకి చేరిపోయాయి. ఇక్కడ నిర్మాణాలలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశుని ఆలయం ఒక్కటే పూర్తి అయింది. భక్తులకు శ్రీవారు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. అయితే, ఇది కూడా ముందు ప్లాన్ లో లా కాకుండా చాలా చిన్నగా నిర్మాణం చేశారు. నాశనమై పోయిన కోట్లాదిరూపాయల ప్రజాధనం.. అమరావతిలో చేపట్టిన పనులకు సుమారు 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా అర్ధాంతరంగా రోడ్లు.. అరకొరగా బిల్డింగ్ లు.. దయనీయంగా మిగిలిపోయాయి. ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటంటే, నిర్మాణ సామాగ్రీని ఎవరికి వారు ఎత్తుకుపోయినా పట్టించుకునే నాధుడే లేడు. దీంతో చాలా సామగ్రి మాయం అయిపోయింది. " అమరావతి అభివృద్ధికి 2021 నవంబర్ 23 నాటి లెక్కల ప్రకారం రూ. 8,572 కోట్లు ఖర్చు అయ్యింది. అందులో రూ.5,674 కోట్లు మౌలిక సదుపాయాల మీద చేసిన ఖర్చు. వడ్డీలు, కన్సల్టెన్సీ చార్జీలు, కౌలు చెల్లింపు, పెన్షన్ల కోసం మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చయ్యాయి. ఇప్పుడు ఎలా అనేదే ఆసక్తికరం.. Amaravati Present Situation: ఐదేళ్ల తరువాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. గెలిచిన వెంటనే రాజధాని నిర్మాణ పనులు చేపడతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. కానీ, ఇప్పటివరకూ సగం సగం నిర్మాణాల్లో ఆగిపోయిన కట్టడాలు ఎంతవరకూ పనికి వస్తాయి? భూగర్భంలో వేసిన పైప్ లైన్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అసలు అక్కడ నిర్మాణాల కోసం కంటే.. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి గ్రౌండ్ క్లియర్ చేయాల్సిన పరిస్థితుల్లో ఎంత డబ్బు మళ్ళీ వృధాగా ఖర్చు చేయాల్సి వస్తుంది? వీటికి నిధుల సేకరణ ఎలా చేస్తారు? ఏవిధంగా అమరావతి రాజధాని నిర్మాంమ్ ముందుకు వెళుతుంది? ఇవన్నీ ప్రస్తుతం జవాబు లేని ప్రశ్నలే. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఎటువంటి జవాబును తన పనులతో ప్రజల ముందుకు తీసుకువస్తుందనేది ఆసక్తి కరం. #chandrababu #amaravati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి