/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pravalika-1-jpg.webp)
హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఊహించిన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు జరిగిన అనంతరం సెంట్రల్ జోన్ డీసీపీ వేంకటేశ్వర్లు సంచలన విషయాలు బయటపెట్టారు. 'వరంగల్‌కు చెందిన ప్రవళిక గ్రూప్స్ పరీక్షల కోసం సన్నద్ధం కావడానికి నగరానికి వచ్చింది. 15 రోజులుగా హాస్టల్‌లో ఉంటుంది. తన రూమ్‌మెట్స్ సంధ్య, అక్షయ, శృతిలతో కలిసి ఉంటుంది. నిన్న రాత్రి 8.30 PM గంటలకు ప్రవళిక సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం వచ్చింది. ఆమె ఆత్మహత్యకు ప్రవళిక స్నేహితులను విచారణ చేశాము. ఆమె రూంలో సూసైడ్ నోట్ దొరికింది. ప్రవళిక మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశాము. ఆమె శివ రామ్ రాథోడ్ అనే యువకుడితో చాటింగ్ చేసింది. ప్రవళిక లవ్ సింబల్స్‌తో రాసిన లెటర్సును కూడా సీజ్ చేశాము. అయితే ప్రవళికను శివరామ్ రాథోడ్ మోసం చేశాడు. వేరే అమ్మాయితో అతనికి నిశ్చితార్ధం కుదిరింది. ప్రవళిక తల్లిదండ్రులకు కూడా శివరామ్, ప్రవళిక ప్రేమ వ్యవహారం తెలుసు.
ప్రవళిక వ్యక్తిగత కారణలతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. శివరామ్, ప్రవళిక ఇద్దరూ నగరంలోని ఓ హోటల్‌కు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్ కూడా మాకు దొరికింది. ఆమె తమ్ముడు ప్రణయ్ కూకట్‌పల్లిలో డిగ్రీ చేస్తున్నాడు. ప్రవళికకు సంబంధించిన లవ్ లెటర్, సీసీ కెమెరా ఫుటేజ్, మైబైల్ ఫోన్, సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని' డీసీపీ వేంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటివరకు ఆమె ఏ పోటీ పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు. శివరామ్ రాథోడ్‌పై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని.. పూర్తి స్థాయిలో విచారణ చేసి మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రవళిక ఆత్మహత్య ఘటనపై ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన నాయకులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.