రాహుల్‌ గాంధీకి షర్మిల అభినందనలు.. కాంగ్రెస్‌లో విలీనం లాంఛనమే?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైసీటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యుడిగా తిరిగి నియమించబడినందుకు ఆమె అభినందనలు తెలిపారు.

New Update
రాహుల్‌ గాంధీకి షర్మిల అభినందనలు.. కాంగ్రెస్‌లో విలీనం లాంఛనమే?

"పార్లమెంట్ సభ్యునిగా తిరిగి నియమించబడ్డ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి నా అభినందనలు. న్యాయం, ధర్మం గెలిచాయనడానికి సుప్రీం కోర్టు తీర్పే ఒక ఉదాహరణ. మీరు తిరిగి పార్లమెంట్‌కి రావడం దేశానికి ఎంతో అవసరం. పార్లమెంట్ వేదికగా మీ గళం వినిపిస్తారని దేశం ఎదురుచూస్తుంది. అహర్నిశలు ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాద పరిరక్షణ, దేశ భద్రత, ఉన్నతి, ఐక్యతలపై మీ పోరాట పఠిమ ఎంతో ఆదర్శం. దేశ భద్రత, ఉన్నతి, ఐక్యత వీటిపై అందరు నాయకులు కలిసి పోరాడాలి. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బేషరతుగా నా నైతిక మద్దతు తెలియజేస్తున్నా" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

రాహుల్‌ గాంధీకి మద్దతుగా ఆమె మరోసారి ట్వీట్ చేయడంపై కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో కూడా రాహుల్ పుట్టినరోజున, కర్ణాటలకో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు షర్మిల రాహుల్‌ గాంధీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. అంతకుముందే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్టీపీ విలీనంపై పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. రెండు సార్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్‌తో విలీనం చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇక షర్మిల పార్టీ విలీనం ఇక లాంఛనమే అని అందరూ భావించారు. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెట్టిన పేచీతో విలీన ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే తెలంగాణ ఎన్నికలకు మరో రెండు, మూడు నెలలే సమయం ఉండటంతో షర్మిల మరోసారి విలీన ప్రక్రియపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి చర్చల కోసం డీకే శివకుమార్‌ను కలవడానికి బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాలను ప్రియాంకా గాంధీ తరపున డీకే అనధికారికంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల చేరికపై తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలతో కూడా డీకే చర్చిస్తున్నారట.

విలీనం వల్ల కలిగే లాభనష్టాలను కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణ నుంచి రాజకీయాలు చేయాలా? లేదంటే ఏపీని రాజకీయ క్షేత్రంగా మార్చుకోవాలా అనే విషయాలపై అభిప్రాయాలు అడిగినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మరోసారి అభిప్రాయం అడిగినట్లు సమాచారం. సీనియర్ నేతల అభిప్రాయం, షర్మిల విజ్ఞప్తులను అధిష్టానం ముందు ఉంచి ఓ నిర్ణయం తీసుకోవాలని డీకే కోరనున్నారట. ఈ తరుణంలోనే రాహుల్‌ గాంధీని పొగుడుతూ షర్మిల ట్వీట్ చేయడం విలీనం ప్రక్రియ ఇక లాంఛనమే అన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు