నా చావు కోరుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

New Update
నా చావు కోరుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బంగారం తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరులో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వారి ఆరోపణలపై స్పందించిన శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత‌లు రాజ‌కీయంగా ఓడించ‌లేక త‌న మ‌ర‌ణాన్ని కోరుకుంటున్నార‌ని సంచలన ఆరోపణలు చేశారు. తాను భౌతికంగా ఉంటే టీడీపీ నేత‌లు గెలవలే.. రాజకీయంగా ఎలాంటి ప‌ద‌వులు పొంద‌లేరన్నారు. పోలీసులు, ఇంటెలిజెన్స్‌, ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యాన్ని గ‌మ‌నించాలని కోరారు.

2010లో త‌న‌పై మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ద‌ర‌రాజుల‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు హ‌త్యాయ‌త్నం చేశారన్నారు. దేవుడి ద‌య వ‌ల్ల ఆనాడు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాని వెల్లడించారు. ఇప్పుడు స‌హ‌జంగానో, అస‌హ‌జంగానో త‌న మ‌ర‌ణాన్ని టీడీపీ నేత‌లు కోరుకుంటున్నారని ఆరోపించారు. అందుకే త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు, బుర‌ద జ‌ల్లుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు బొల్ల‌వ‌రంలోని మ‌హ‌ర్షి ఆశ్ర‌మంకు చెందిన స్కూలు స్థ‌లాన్ని చవ‌క‌గా కొని సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారన్నారు. అందుకే ప్రొద్దుటూరు స‌బ్ రిజిస్ట్రార్‌ను లోబ‌రుచుకునేందుకు బెదిరించే య‌త్నం చేస్తున్నారని తెలిపారు.

స‌ర్వేనంబ‌రు 592కు సంబంధించిన ఎక‌రా 71 సెంట్ల భూమి తాలూకు రిజిస్ట్రేషన్‌కు సంబంధించి క్లియ‌రెన్స్ లేక‌పోవ‌డం.. కోర్టు నుంచి సంబంధిత ఆశ్ర‌మ య‌జ‌మాని అయిన కందుల ఓబులరెడ్డికి అనుకూలంగా స్టే వచ్చింది. స్టే రావ‌డంతో రిజిస్ట్రేష‌న్ చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డిందన్నారు. అంతేకాక మిగిలిన స్థ‌లానికి సంబంధించిన చాక‌లి మాన్యంకు సంబంధించి జిల్లా క‌లెక్ట‌ర్ నుంచి త‌గిన విధంగా క్లియ‌రెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఆగిపోయిందన్నారు. త‌న‌కు అనుకూలంగా లేక‌పోవ‌డం వ‌ల్లే మాజీ ఎమ్మెల్యే వ‌ద‌రరాజుల‌ రెడ్డి చ‌ట్ట విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని.. స‌బ్ రిజిస్ట్రార్‌తో పాటు సిబ్బందిని బెదిరిస్తున్నారని ఆరోప‌ణ‌లు చేశారు. వ‌ర‌ద‌రాజ‌ల రెడ్డి చ‌ట్ట‌వ్య‌తిరేక కార్యకలాపాలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా రిజిస్ట్రార్ పివిఎన్ బాబు, డీఐజి శివ‌రాంల‌కు ఎమ్మెల్యే లిఖితపూర్వ‌కంగా ఫిర్యాదుచేశారు. తక్షణమే మాజీ ఎమ్మెల్యేపై కేసు న‌మోదు చేసి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాచమల్లు డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు