Telangana Elections 2023: పింఛనుదారులే బీఆర్ఎస్‎కు ‘ఆసరా’.. ఈసారీ గట్టెక్కిస్తారా!

పెద్దసంఖ్యలో ఉన్న ‘ఆసరా’ లబ్ధిదారులపైనే బీఆర్ఎస్ మరోసారి ఆశలు పెట్టుకుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మేనిఫెస్టోలోనూ పింఛను పెంపునకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఈ దఫా వారు ఎవరికి మద్దతిస్తారన్న దానిపైనే అన్ని పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

New Update
Telangana Elections 2023: పింఛనుదారులే బీఆర్ఎస్‎కు ‘ఆసరా’.. ఈసారీ గట్టెక్కిస్తారా!

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పింఛనుదారుల ఓట్లు నిర్ణాయకంగా మారబోతున్నాయి. నిరుద్యోగులు, యువత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న నివేదికల నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న ‘ఆసరా’ లబ్ధిదారులపైనే బీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా పింఛన్లను పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సారి కూడా మేనిఫెస్టోలో ఆ అంశానికే పెద్దపీట వేయడం గమనార్హం. గత ఎన్నికల్లోనూ ఆసరా పింఛన్ల పెంపు హామీ ఎంతలా ప్రభావం చూపిందో తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా పింఛను లబ్ధిదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు మేనిఫెస్టోల్లో పింఛను హామీలకు ప్రాధాన్యమిచ్చాయి.

ఇది కూడా చదవండి: బర్రెలక్కకు గన్మెన్.. ఎన్నికలు ముగిసే వరకు భద్రత.. హైకోర్టు సంచలన ఆదేశాలు

మళ్లీ అధికారంలోకి రాగానే అన్ని సామాజిక పింఛన్లను విడతల వారీగా రూ. 5 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దివ్యాంగుల ప్రస్తుతం పింఛను రూ. 4 వేలను రూ.6 వేలకు పెంచుతామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా పింఛను దారులను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించింది. చేయూత పేరుతో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛన్లు అందిస్తామని మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ ఆరు హామీల్లో చేర్చిన ‘మహాలక్ష్మి’ ద్వారా మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ కూడా పింఛన్లపై మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొని వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది.

ఇది కూడా చదవండి: ఐదేళ్లకే అచేతనం.. ఈ తల్లిదండ్రుల నిర్ణయానికి సెల్యూట్ చేయాల్సిందే!

రాష్ట్రంలో ప్రస్తుతం 43లక్షలకు పైగా (అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన లెక్కల ప్రకారం) ఆసరా పింఛను (Asara Pensions) లబ్ధిదారులున్నారు. వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు, హెచ్ఐవీ బాధితులు సహా మొత్తం 11 వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం పింఛను ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. దేశంలో బీడీ కార్మికులకు ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దశలవారీగా పింఛను మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చింది. అంతేకాకుండా 2020లో పింఛను అర్హత వయస్సును 65 నుంచి 57ఏళ్లకు తగ్గించడంతో లబ్ధిదారుల సంఖ్య 7 నుంచి 8 లక్షలు పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఈ సంఖ్య 28 లక్షలుగా ఉండేది. భారీగా పెరిగిన లబ్ధిదారుల సంఖ్యతో పాటు పింఛను మొత్తం కూడా పెరగడం తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల అనుభవం కూడా ఇదే చెప్తోంది. 2023-24 బడ్జెట్ లో ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,774.90 కోట్లను కేటాయించింది. దీంతోపాటు దివ్యాంగులకు పింఛను రూ.4016కు పెంచింది. పింఛను దరఖాస్తు విధానాన్ని కూడా ప్రభుత్వం సులభతరం చేసింది. గతంలో గ్రామ, మండల, లేదా వార్డు స్థాయి అధికారులు పింఛను దరఖాస్తులు తీసుకునేవారు. 2022 - 23లో సంస్కరణల అనంతరం లబ్ధిదారులపై చార్జీలు వేయకుండా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది.

ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇస్తున్న పింఛన్లతో తెలంగాణలో పింఛన్లను పోలుస్తూ బీఆర్ఎస్ భారీగా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవ్వని పింఛను తెలంగాణలో ఎలా ఇవ్వగలరని బీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభల ద్వారా నిలదీస్తూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఈ సారి ప్రభుత్వంపై యువత, నిరుద్యోగుల అసంతృప్తి వారి ద్వారా కుటుంబ సభ్యులైన పింఛనుదారులకు కూడా బదిలీ అవుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య 2023 ఎన్నికల్లో ఫలితాన్ని శాసించగల స్థాయిలో ఉన్న ఆసరా లబ్ధిదారులు ఎటు వైపు మొగ్గు చూపుతారన్న అంశమై ఉత్కంఠ నెలకొంది. వారి ఓట్లను ఎంత ఎక్కువగా తమవైపు మళ్లించుకుంటే వివిధ పార్టీల విజయావకాశాలు అంతలా మెరుగవుతాయి.

ఆసరా పింఛను పథకం ద్వారా వివిధ విభాగాల్లో లబ్ధిదారులు (2023 జూన్ నాటికి):
వృద్ధులు - 15. 81లక్షలు
వితంతవులు - 15.54లక్షలు
వికలాంగులు - 5.5లక్షలు
నేతకారులు - 37వేలు
కల్లుగీత కార్మికులు - 65 వేలు
ఫైలేరియా రోగులు - 17 వేలు
డయాలసిస్ రోగులు - 4 వేలు
హెచ్ఐవీ బాధితులు - 35 వేలు
బీడీ కార్మికులు - 4.24 లక్షలు
ఒంటరి మహిళలు - 1.42 లక్షలు

Advertisment
Advertisment
తాజా కథనాలు