మోరంచపల్లిలో ఆ రాత్రి.. ఆ ఊరి ప్రజల కథలు వింటే కన్నీళ్లు ఆగవు

మోరంచపల్లి గ్రామంలో వరద నింపిన విషాదం అంతాఇంతా కాదు.. అక్కడ ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ ఇప్పటివరకు తెలియకపోవడం.. తమ కుటుంబసభ్యులు బతికున్నారో లేదో తెలియక పోవడం తీవ్రంగా కలిచివేస్తోంది.

New Update
మోరంచపల్లిలో ఆ రాత్రి.. ఆ ఊరి ప్రజల కథలు వింటే కన్నీళ్లు ఆగవు

Moranchapalli Floods : చిమ్మ చీకటి.. ఎటు చూసినా అంధకారమే.. బోరునా కురుస్తోన్న వాన.. తెల్లవారుజామున నాలుగు గంటలవుతుంది.. ఊరంతా మరో గంటలో నిద్రలేచే సమయం అది.. ఇంతలోనే భారీ శబ్దంతో మూసిఉన్న తలుపులను తోసుకుంటూ.. వరదంతా ఉగ్రరూపం దాల్చుతూ ఇంటి మొత్తాన్ని నీటిమయం చేసేసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే పీకల వరకు నీరు వచ్చేసింది. కదలడమే కష్టమైపోయిన క్షణాలవి.. అతికష్టం మీద నడుస్తూ.. బయట పడే మార్గం ఏంటో అర్థం అవ్వక.. బతుకుతామో లేదో తెలియక..ఆ రాత్రి (జులై 26) నరకం అనుభవించారు మోరంచపల్లి(moranchapally) గ్రామస్తులు. వరుణుడు సృష్టించిన బీభత్సానికి బతుకులు కూలిపోయాయి.. వస్తువులు కొట్టుకుపోయాయి.. అసలు ఊరంతా నామరూపాలు లేకుండా పోయింది.

వీధిని ఊడ్చిన వరద.. ఇంట్లోకి చెత్తను తెచ్చింది. చుట్టూ చీకట్లు కమ్ముకొని ఉన్న వేళ.. తమ కుటుంబసభ్యులు వరద నీటిలో కొట్టుకుపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం తప్ప మరో దారి కనిపించలేదంటే ఆ ఊరి ప్రజల బాధ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ప్రాణాలు విడిచి.. కుటుంబసభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన వారు కొందరైతే.. అసలు వరదలో కొట్టుకుపోయిన వారు బతికున్నారో లేదో తెలియని కన్నీటి ఎదురు చూపులు మరోవైపు. గమ్యం కనుచూపు మేర కాన రాకుంటే...వరద నీటిలో కొట్టుకుపోతూ ఎటు వెళ్తున్నామో తెలియని అయోమయ బతుకులు వారివి. ఇలా మోరంచపల్లిలో ఎవర్ని కదలించినా కన్నీళ్లే.. ఎవర్ని పలకరించినా విషాద కథలే..!

భారీ వర్షం కురిస్తే మళ్లీ ఇదే జరుగుతుందా? ఆ ఊరి ప్రజలు ఏం అంటున్నారు? వారి బాధలేంటో అందరికి తెలిసేలా చేసింది ఆర్టీవీ(RTV). బాధితులు పడుతున్న నరకవేదనను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇక్కడ మేం ఉండలేం మహా ప్రభో అంటూ సర్వం కోల్పోయి సతమతమవుతున్న ప్రజలు ఆర్టీవీతో తమ వరద గాదను పంచుకున్నారు. ఆ రాత్రి నరకం అనుభవించామని.. ఇంటిలోని పోల్స్‌ పట్టుకోని బతుకు జీవుడా అంటూ ఉండిపోయినట్టు చెబుతున్నారు. ఇంట్లో వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోతుంటే.. రోడ్డుపై ఉండాల్సిన బర్రెలు, గొర్రెలు తమ ఇళ్లలోకి కొట్టుకొస్తుంటే..వాటి కొమ్ములు శరీరానికి తగిలి రక్తం కారుతుంటే ఏం చేయాలో తెలియని దుస్థితిలో దేవుడిపైనే భారమేసినట్టు కన్నీరు పెట్టుకుంటున్నారు. పెట్టుకొన్న ఆశలన్నీ ఆవిరవుతుంటే ఏం చేయాలో అర్థంకాని దయనీయ స్థితి మోరంచపల్లి గ్రామస్తులది. తన భార్య వరద నీటిలో కొట్టుకుపోయి రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఆమె గురించి సమాచారం లేదని.. అసలు తను బతికుందో లేదోనైనా చెప్పాలంటూ ఓ భర్త పడుతున్న బాధను చూస్తే కన్నీళ్లు ఆగవు. ఇలాంటి విషాద కథలే మోరంచపల్లిలో ఎవర్ని కదిలించినా వినిపిస్తున్నాయి.. కన్నీరు పెట్టిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు