AP: కన్నీరు పెట్టిస్తోన్న హారిక కథ.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి..!

అచ్యుతాపురం ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక(22) నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన హారిక నిన్న ఉదయమే కంపెనీకి వెళ్లింది. ఆమె వెళ్లిన కొద్ది గంటల్లోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

New Update
AP: కన్నీరు పెట్టిస్తోన్న హారిక కథ.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి..!

Kakinada: అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన చల్లపల్లి హారిక(22) మృతదేహం కాకినాడలోని తన ఇంటికి తరలించారు. హారిక మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మూడు రోజుల క్రితం సోదరుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన హారిక విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు అందరికీ కంటతడి పెట్టిస్తోంది.

మృతి చెందిన చర్లపల్లి హారిక (22) చాలా కష్టపడి పైకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కాకినాడ అర్బన్ 2వార్డు సౌజన్య నగర్ కి చెందిన ఈశ్వరరావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె చల్లపల్లి హారిక. తండ్రి ఈశ్వరరావు తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు. అయితే, హారిక చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయాడు. సోదరుడు కూడా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో తల్లి అన్నపూర్ణ, నానమ్మ సంరక్షణలో ఆమె పెరిగింది.

Also Read: పేలింది బాయిలర్ కాదు.. ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి సంచలన ప్రకటన!

మెరిట్ విద్యార్థినిగా పేరు గడించింది హారిక. కడు పేదరికంలో పుట్టినా చదువుల తల్లిగా ఎదిగి ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది. అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ప్రమాదం జరిగిన ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందింది. రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన హారిక.. పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. మరొక రోజు తమతో ఉండాలని కుటుంబసభ్యులు కోరడంతో సెలవు కోసం ప్రయత్నించింది. కానీ, సెలవు ఇవ్వకపోవడంతో అదే రోజు ఆమె విధులకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే, కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే ఈ దారుణం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో హారిక ప్రాణాలు కోల్పోయింది. భవన శిథిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందింది. అక్కడ పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని అధికారులు స్వస్థలం కాకినాడకు తరలించారు. హారిక మరొక్క రోజు కాకినాడలోనే ఉండి ఉంటే ప్రాణాలతోనే ఉండేదని అనుకుంటూ.. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరికీ కంటతడి పెట్టిస్తోంది.

#vishaka
Advertisment
Advertisment
తాజా కథనాలు