Union Ministers Portfolios: కేంద్ర మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ..?

కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరింది. ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు వారికి శాఖలను కేటాయిస్తారని చెబుతున్నారు. సాయంత్రం తొలి క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ సమావేశం ముందు పోర్ట్ ఫోలియోలు కేటాయించే అవకాశం ఉంది.  

New Update
Union Ministers Portfolios: కేంద్ర మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ..?

Union Ministers Portfolios: నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీతో పాటు ప్రభుత్వంలోని మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2014, 2019 తర్వాత వరుసగా మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. ప్రమాణస్వీకారం తర్వాత ఏ మంత్రికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపైనే ఇప్పుడు అందరి చూపు నెలకొంది. రాజకీయ వర్గాల్లో శాఖల కేటాయింపుపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేస్తున్నారు.

ప్రధాని మోదీ మూడో ఇన్నింగ్స్‌లో ప్రభుత్వం అతిపెద్ద మంత్రివర్గం ఏర్పాటు అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మోదీ క్యాబినెట్ తొలి సమావేశం (Cabinet Meeting) జరగనుంది.  ఈ తొలి కేబినెట్ భేటీ తర్వాత లేదా కొంత ముందుగా మంత్రులందరికీ శాఖల విభజన జరుగుతుందని చెబుతున్నారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, 36 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. 24 రాష్ట్రాల ఎంపీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 71 మంది సభ్యుల బృందంలో యువత - అనుభవజ్ఞులైన నాయకుల సమతూకాన్ని సృష్టించే ప్రయత్నం కూడా జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం స్థానం నుండి మూడవసారి ఎన్నికైన రామ్ మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu), 36 సంవత్సరాల వయస్సులో ఈ క్యాబినెట్‌లోని అతి పిన్న వయస్కుడైన మంత్రి. ఇక జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi), 79 సంవత్సరాల వయస్సులో, అత్యంత వృద్ధ మంత్రి. ప్రధాని మోదీ మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీలు, 5 మంది ఎస్టీలు, 5 మంది మైనార్టీలకు చోటు దక్కింది. కొత్త కేబినెట్‌లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలన్నీ కూడా చేరాయి. అంతేకాకుండా, గత ప్రభుత్వంలో భాగమైన సీనియర్ నాయకులకు మళ్ళీ కీలక పోర్ట్ ఫోలియోలు లభించే అవకాశం ఉంది. హోమ్ శాఖ మళ్ళీ అమిత్ షాకు ఇస్తారని చెబుతున్నారు. అలాగే, ఆర్ధిక శాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ ఇవి మోదీ పాట మంత్రులకే కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

మోదీ మంత్రివర్గంలో పాత యోధులు..
ప్రధాని మోదీ తర్వాత బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్ల రాజ్‌నాథ్ సింగ్ మోదీ ప్రభుత్వంలో మొదటి టర్మ్‌లో హోం మంత్రిగా, రెండవ టర్మ్‌లో రక్షణ మంత్రిగా పనిచేశారు. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్ తర్వాత అమిత్ షా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రభుత్వం రెండో దఫాలో అమిత్ షా హోం, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. 59 ఏళ్ల అమిత్ షా బలమైన నాయకుడు- పార్టీకి ప్రత్యేక వ్యూహకర్తగా పరిగణిస్తారు. ఈసారి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి దాదాపు ఏడున్నర లక్షల ఓట్ల తేడాతో గెలుపొంది లోక్‌సభకు చేరుకున్నారు.

Also Read: మోదీ కేబినేట్‌లో నిర్మలాసీతారామన్ అరుదైన రికార్డ్..

తెలుగురాష్ట్రాల మంత్రులకు..
తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 5 గురికి మంత్రివర్గంలో స్థానం దక్కింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదాలో స్థానం లభించింది. బండిసంజయ్ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా ఇచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలకు సహాయ మంత్రులుగా అవకాశం కల్పించారు. కిషన్ రెడ్డికి కీలకమైన శాఖను కేటాయించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మరోవైపు రామ్మోహన్ నాయుడుకు కేటాయించే శాఖపైన గట్టి చర్చే నడుస్తోంది. 

మోదీ మంత్రివర్గంలో మహిళలు వీరే..
ప్రధాని మోదీ రెండోసారి 2.0లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌పై ప్రధాని మరోసారి విశ్వాసం చూపించారు. సీతారామన్‌తో పాటు జార్ఖండ్‌లోని కోడెర్మా ఎంపీ అన్నపూర్ణాదేవి, యూపీలోని మీర్జాపూర్ ఎంపీ అనుప్రియా పటేల్, కర్ణాటకలోని బెంగళూరు నార్త్ ఎంపీ శోభా కరంద్లాజేలకు మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కింది. 37 ఏళ్ల రక్షా నిఖిల్ ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా పేర్లు కూడా తొలిసారిగా మంత్రులు అయిన మహిళా నేతల్లో ఉన్నాయి. ఇప్పుడు నిర్మలాసీతారామన్ ఆర్దికమంత్రిగా కొనసాగుతారా? లేదా? అనేదానిపై కూడా చర్చ నడుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు