దిగొచ్చిన టమాటా ధరలు.. సామాన్యులకు సంతోషం.. అన్నదాతలకు కష్టం..

మొన్నటి వరకు కోట్లు సంపాదించిన టమాటా రైతులు ప్రస్తుతం బిక్కమొహం పెడుతున్నారు. దిగుబడి పెరిగి ధరలు తగ్గుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట పరిస్థితి ఏంటని వాపోతున్నారు.

New Update
Delhi : ఢిల్లీలో రూ.100కి చేరిన కిలో టమాటా

కిలో టమాటాలు రూ.30-40.. 

ఆకాశాన్నింటిన టమాటా ధరలు క్రమేపి నేల చూపు చూస్తున్నాయి. సామాన్యులను కొనడానికే భయపెట్టిన టమాటా ప్రస్తుతం కొనుగోలు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. దిగుబడి పెరగడంతో ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో మాడు, నాలుగు రోజులుగా టమాటా ధరలు దిగొస్తున్నాయి. శుక్రవారం మార్కెట్ కు 400 టన్నుల టమాటా రావడంతో ఏ గ్రేడ్ టమాటాలు కిలో రూ.30-40 మధ్య పలికాయి. బీ గ్రేడ్ రకాలు కిలో రూ.21-28 మధ్య ఉన్నాయి. సగటున రూ.26 నుంచి రూ.37 వరకు టమాటాలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. గురువారం మదనపల్లె మార్కెట్ కు 300 టన్నుల టమాటా సరుకు చేరడంతో ఏ గ్రేడ్ కిలో రూ.50-64, బీ గ్రేడ్ టమాటా ధర కిలో రూ.36-48 వరకు పలికింది. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలో టమాటా దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గాయంటున్నారు.

ఆందోళన చెందుతున్న రైతులు..

కొంతకాలంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. టమాటాలు వంటలో వాడాలంటే సామాన్యులు జంకారు. కిలో టమాటాల ధర రూ.200కు పైనే పలికింది. దీంతో చాలా మంది టమాటా రైతులు కోటీశ్వరులు అయ్యారు. తాజాగా టమాటా ధరలు తగ్గుతుండడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తుంటే రైతన్నలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. టమాటా ధరలు భారీగా పెరుగుతుండడంతో చాలా మంది రైతులు టమాటా పంటను భారీగా సాగుచేశారు. దీంతో పంట దిగుబడి పెరిగడంతో ధర పడిపోయింది. దీంతో కిలో రూ.150-200 పలికిన టమాటా.. ప్రస్తుతం రూ.30 పలుకుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చేతికొచ్చిన పంట పరిస్థితి ఏంటి?

ధరలను ఓ సారి పరిశీలిస్తే.. ఆగస్టు 4న కిలో టమాటా గరిష్ఠ ధర రూ.136 కాగా, కనిష్ఠ ధర రూ.100 పలికింది. ఆగస్టు 5న కిలో టమాటా గరిష్ఠ ధర రూ.100, కనిష్ఠంగా రూ.76కు చేరుకుంది. ఆరో తేదీన గరిష్ఠ ధర రూ.116 కాగా, కనిష్ఠ ధర రూ.90గా ఉంది. క్రమంగా తగ్గుతూ వచ్చిన టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో మొన్నటి వరకు కోట్లు సంపాదించిన టమాటా రైతులు ప్రస్తుతం బిక్కమొహం పెడుతున్నారు. చేతికొచ్చిన పంట పరిస్థితి ఏంటని వాపోతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు