US Open 2023: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. యూఎస్ ఓపెన్ విజేతగా సెర్బియా స్టార్

టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచులో రష్యా ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్‌పై సెర్బియా స్టార్ ఘన విజయం సాధించాడు. దీంతో తన 36వ కెరీర్ ఫైనల్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ గెలిచి రికార్డు సృష్టించాడు.

New Update
US Open 2023: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. యూఎస్ ఓపెన్ విజేతగా సెర్బియా స్టార్

US Open 2023: టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచులో రష్యా ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్‌పై సెర్బియా స్టార్ ఘన విజయం సాధించాడు. మ్యాచ్ ఆద్యంతం పూర్తి ఆధిక్యం కనబరిచాడు నోవాక్. తొలి సెట్‌లో 6-3 తేడాతో నెగ్గాడు. అయితే రెండో సెట్‌లో అద్భుతంగా పుంజుకున్న మెద్వెదేవ్ ఓ దశలో 6-6తో గట్టి పోటీ ఇచ్చాడు. కానీ చివరికి 7-6 పాయింట్లతో జకోవిచ్ ఈ సెట్ కూడా గెలుచుకున్నారు.

ఇక చివరిదైన మూడో సెట్‌లో మళ్లీ 6-3తో గెలిచి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. దీంతో తన 36వ కెరీర్ ఫైనల్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ గెలిచి రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మార్గరెట్ కోర్టు(24) సరసన నిలిచాడు.

2021లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌లో మెద్వెదేవ్‌ చేతిలో జకోవిచ్ ఓడిపోయాడు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకున్న నోవాక్ మ్యాచ్ అనంతరం తీవ్ర ఉద్వేగానికి గురై టెన్నిస్ కోర్టులోనే కింద కూర్చున్నాడు. ఈ ఏడాది జకోవిచ్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలుపొందగా వింబుల్డన్‌ పోరులో మాత్రం యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

అంతకుముందు జరిగిన యూఎస్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్ కోకో గాఫ్ గెలుచుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్‍లో బెలారస్‍కు చెందిన ప్ర‌పంచ రెండో సీడ్ అరీనా సబలెంకాను ఓడించి అమెరికా యువ సంచలనం కోకో సరికొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‍ను కైవసం చేసుకుని దిగ్గజ ప్లేయర్ సెరెనా విలియమ్స్ సరసన నిలిచింది.

యూఎస్ ఓపెన్స్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రెండో సీడ్ అరీనా సబలెంకా చేతిలో ఆరో సీడ్ అయిన కోకో 2-6 తేడాతో ఫస్ట్ సెట్ కోల్పోయింది. అయితే రెండో సెట్‌లో పుంజుకున్న కోకో అద్భుతమైన షాట్స్‌తో సబలెంకాను ఇబ్బందిపెట్టింది. దీంతో రెండో సెట్‌ 6-3తేడాతో గెలుచుకుంది. అనంతరం మూడో సెట్‌లోనూ విజృంభించి 6-2తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు