తెలుగోడికి గుజరాత్‌లో అపూర్వ గౌరవం

నిజాయితీ గల తెలుగు వ్యక్తికి రాష్ట్రం కాని రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది. మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుని వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్తున్న ఆయనకు అక్కడి స్థానికులు పూలవర్షంతో వీడ్కోలు పలికారు.

New Update
తెలుగోడికి గుజరాత్‌లో అపూర్వ గౌరవం

గాంధీనగర్ ఎస్పీగా బదిలీ.. 

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఎస్పీగా తెలుగు వ్యక్తి నియమితులు కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన వాసంశెట్టి రవితేజ గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇటీవల ప్రమోషన్‌ వచ్చి ఎస్పీగా గాంధీనగర్‌కు బదిలీ అయ్యారు. దీంతో బదిలీపై వెళుతున్న ఆయనకు ఆ జిల్లా వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. విధుల్లో ఉన్నప్పుడు నిజాయితీగా పనిచేసేవారని.. అన్ని విధాలుగా మద్దతుగా ఉండేవారని ప్రజలు చెబుతున్నారు.

పూలవర్షంతో అపూర్వ స్వాగతం..

2015 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన జునాగఢ్‌ ఎస్పీగా మూడేళ్లు సేవలు అందించి అక్కడి ప్రజల మన్ననలు పొందారు. జునాగఢ్‌ నుంచి బదిలీపై గాంధీనగర్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు. దీంతో అక్కడ సోమవారం బాధ్యతలు స్వీకరించడానికి వెళ్తున్న రవితేజకు జునాగఢ్ ప్రజలు ఘన వీడ్కోలు పలికారు. అటు గాంధీనగర్‌ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లిన ఆయనకు అక్కడి ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. గతంలో ఆయన అందించిన పోలీసు సేవలకు అప్పటి డిప్యూటీ సీఎం నవీన్‌ పటేల్‌ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. రవితేజ తండ్రి నాగేశ్వరరావు, తల్లి మల్లికాదేవి తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు.

మురిసిపోతున్న కోనసీమ వాసులు..

కోనసీమకు చెందిన వ్యక్తి గుజరాత్‌లో నిజాయితీ గత పోలీసాఫీసర్‌గా పేరుప్రఖ్యాతలు సంపాదించడంతో ఈ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రవితేజకు ఘన వీడ్కోలు, అపూర్వస్వాగతం పలికిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు.

రెండు నెలల క్రితం జూనాగఢ్‌లో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌లో భాగంగా మజేవాడి గేట్ సమీపంలో ఉన్న దర్గాకు మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేత నోటీసులు ఇచ్చారు. దీంతో నగరంలో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో ఒకరు మరణించగా ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. దర్గా సమీపంలో దాదాపు 500-600 మంది నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులపై దాడికి దిగారు. ఈ ఘటనకు 174 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దర్గా కూల్చాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో దాదాపు 500-600 మంది ప్రజలు గుమిగూడి రోడ్లను దిగ్బంధించారని జునాగఢ్ ఎస్పీ రవితేజ తెలిపారు. మతఘర్షణలు తలెత్తకుండా ఎస్పీ రవితేజ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు