Defections of MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్‌ తేలనుందా? రేపే సుప్రీంలో కీలక విచారణ

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును జస్టిస్ అగస్టీన్ జార్జ్ , జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించనుంది. దీంతో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

New Update
BRS MLAS

MLAs who defected from the party

Defections of MLAs : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో 8 మందిని ఇప్పటికే విచారించిన శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వారికి క్లీన్‌చీట్‌ ఇచ్చారు. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెగేసి చెప్పారు, అయితే ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు పై కీలక విచారణ సాగనుంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ కేసును జస్టిస్ అగస్టీన్ జార్జ్ , జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించనుంది.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ తో పాటు, బీజేపీ  కోర్టును ఆశ్రయించాయి. అయితే.. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇటీవల సదరు ఎమ్మెల్యేల్లో  ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు.. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయకూడదని.. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్లపై ఉందని అత్యున్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసింది. అంతేకాదు ఒక దశలో మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా? లేక మీరు తీసుకుంటారా? అంటూ సీరియస్‌గా ప్రశ్నించింది.

స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ వ్యవహరించిన తీరు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించేలా ఉందని ఆరోపిస్తూ ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా వేశారు. కోర్టు నిర్దేశించిన గడువును, సూచనలను పాటించకుండా ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చారని మహేశ్వర్‌ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో రేపటి విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్‌ను పరిగణనలోకి తీసుకుంటుందా లేదా కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ తీర్పు తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తును నిర్ణయించనుందన్న చర్చ సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు