/rtv/media/media_files/2026/03/01/huzurabad-mla-padi-kaushik-2026-03-01-21-35-58.jpg)
Huzurabad MLA Padi Kaushik
BRS MLA Padi Kaushik Reddy : హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం మీద కాకుండా కరీంనగర్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మీద ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఆయన పెద్ద ఎత్తున నగదు వసూల్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలు అన్ని త్వరలోనే బయట పెడతానని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాలో మాట్లాడుతూ.. సీపీ గౌస్ ఆలం అధికార దుర్వినియోగానికి పాల్పడు తున్నార న్నారు. ప్రభుత్వ వాహనానం ఇన్నోవాను (TS 09 PA 4195 ) హైదరాబాద్ లో ప్రైవేటు వ్యక్తుల కోసం ఉపయోగించ డమే కాకుండా దానికి కరీంనగర్ వన్ టౌన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ అశోక్ , ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ డ్రైవర్లగా ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించారు.
ఐఆర్ఎస్ అధికారి అయిన వికాస్ అగర్వాల్ కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు మిత్రుడు కావడంతో అమీర్ పేటలో ఉంటున్న ఆయన తండ్రి కోసం ఈ వాహనాన్ని వినియోగిస్తు్న్నారని తెలిపారు.ఈ వాహనాన్ని గత 8 నెలలుగా సుభేదాలో పార్క్ చేస్తున్నారని అయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ సివిలియన్ కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడడంపై డీజీపీ సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అదే కాకుండా సీపీ గౌస్ ఆలం సోదరుడు సైతం ఇన్నోవా వాహనం నెంబర్ TS 09 PA 5601 ను వాడుతున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కారు రోజూ చలిమెడ కాలేజీలో సీపీ సోదరున్ని డ్రాప్ చేయడానికి వినియోగిస్తున్నారని తెలిపారు. అంతేకాక సీపీ గౌస్ ఆలం సతీమణికి కరీంనగర్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా వచ్చిందో అందరికి తెలుసుని ఎద్దేవా చేశారు. ఆమె కోసం కూడా ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు డ్యూటీ చేయడం దారుణమని విమర్శించారు.
కరీంనగర్ జిల్లాలో సీపీ గౌస్ ఆలం పెద్ద ఎత్తున ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆయన జిల్లాలో పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ఆ ఆధారాలు అన్ని త్వరలోనే బయట పెడుతానని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు చెందిన బియ్యం సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని ఈ అక్రమాలకు పాల్పడే వారి వద్ద నుంచి కరీంనగర్ సీపీ నగదు వసూలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఈ నగదు వసూల్ చేయించేందుకు ఏసీపీ విజయ్ కుమార్, సీఐ సృజన్ రెడ్డిని సీపీ నియమించారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 337 మంది హోంగార్డులను బదిలీ చేసిన సీపీ వారిని బదిలీ చేసేందుకు రూ. కోటి తీసుకున్నారన్నారు.పెద్దపల్లిలోనూ హోంగార్డ్స్‌ను బదిలీ చేసేందుకు సీపీ సిద్ధమైతే మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకోవడంతో అవి ఆగిపోయాయని గుర్తు చేశారు.
జనవరి 8న ఎస్ఎన్ ఫ్రైడ్ మాల్‌కు నిరభ్యంతర నివేదిక (NOC) ఇచ్చేందుకు ఆ మాల్ యజమాని వద్ద నుంచి రూ. 25 లక్షలు సీపీ గౌస్ ఆలం వసూలు చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రికి, మాజీ ఎమ్మెల్యేకు ఒక్క గన్ మెన్ కూడా లేరని.. కానీ కరీంనగర్ సీపీకి మాత్రం ఎస్కార్ట్ వాహనాలతో పాటు 2 + 2 గన్‌మెన్స్ పెట్టుకున్నారని వివరించారు. అంతేకాక సీపీ నివాసంలో 20 మంది కానిస్టేబుల్స్ పని చేస్తున్నారన్నారు. కాగా కరీంనగర్ సీపీపై సీఎస్, డీజీపీ చర్యలు తీసుకోకపోతే 15 రోజుల్లో అన్ని వాస్తవాలు బయట పెడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అంతేకాక తన ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, ఇంటిలిజెన్స్ ఐజీని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Follow Us