Telangana : లండన్‌లో కౌన్సిలర్‌గా తెలంగాణ యువతి..11 మందిని ఓడించి విజయం

లండన్‌ స్థానిక ఎన్నికల్లో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా లండన్ లో మే 7న జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన కొన్కటి పూజిత అద్భుత విజయం సాధించి వార్తల్లో నిలిచారు.

New Update
FotoJet - 2026-05-10T065945.541

Councilor Konkati Pujita

Telangana : లండన్‌ స్థానిక ఎన్నికల్లో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా లండన్ మే 7న జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన కొన్కటి పూజిత అద్భుత విజయం సాధించి వార్తల్లో నిలిచారు. గ్రీన్ పార్టీ (The Green Party) తరఫున లండన్ బరో ఆఫ్ న్యూహమ్‌లోని 'రాయల్ ఆల్బర్ట్' (Royal Albert) వార్డు నుండి కౌన్సిలర్‌గా ఆమె ఎన్నికయ్యారు.పూజిత కుటుంబానికి తెలంగాణలోని రెండు జిల్లాలతో బలమైన అనుబంధం ఉంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఉసిల్లపల్లి గ్రామానికి చెందిన కొన్కటి పూజిత బయోటెక్నాలజీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె ఉన్నత అవకాశాల కోసం లండన్ చేరుకుని అక్కడే స్థిరపడ్డారు.

 హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన కడదూరి శ్రీనివాస్‌తో గతేడాది పూజితకు వివాహమైంది. శ్రీనివాస్ హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి లండన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ దంపతులు లండన్‌లోనే నివసిస్తున్నారు.లండన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 'న్యూహమ్ బరో రాయల్ ఆల్బర్ట్' వార్డు స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది.: వివిధ ప్రధాన పార్టీల నుండి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, పూజిత గ్రీన్ పార్టీ తరఫున నిలబడ్డారు. చాలా కాలంగా లేబర్ పార్టీకి కంచుకోటగా ఉన్న న్యూహమ్ బరోలో ఈసారి గ్రీన్ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీని ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజా సంక్షేమమే అజెండాగా సాగిన ప్రచారంలో పూజిత ఓటర్లను ఆకట్టుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఆమెకు స్పష్టమైన మద్దతు అందించి కౌన్సిలర్‌గా గెలిపించారు.

పూజిత లండన్‌లో కౌన్సిలర్‌గా విజయం సాధించినట్లు తెలియడంతో హనుమకొండ జిల్లా ఐనవోలుతో పాటు, పెద్దపల్లి జిల్లాలోని ఆమె స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విదేశీ గడ్డపై తెలుగు ఆడపడుచు అత్యున్నత స్థానానికి ఎదగడం, లండన్ స్థానిక ప్రభుత్వంలో భాగస్వామి కావడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూజిత సాధించిన ఈ విజయం బ్రిటన్‌లోని తెలుగు కమ్యూనిటీకి ఎంతో గర్వకారణంగా నిలిచింది.

Advertisment
తాజా కథనాలు