/rtv/media/media_files/2026/05/08/tg-dgp-2026-05-08-11-42-41.jpg)
దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన భారత జనాభా గణన (Census 2027) ప్రక్రియలో భాగంగా కీలకమైన అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలు తమ వివరాలను అధికారుల సాయం లేకుండా, స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే వినూత్న స్వీయ గణన (Self-Enumeration) విధానానికి సంబంధించిన అవగాహన పోస్టర్లను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ, జనాభా గణన విభాగం సంయుక్తంగా రూపొందించిన ఈ పోస్టర్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
డిజిటల్ విధానానికి ప్రాధాన్యత
గతంలో జనాభా లెక్కల సిబ్బంది ప్రతి ఇంటికీ వచ్చి వివరాలు సేకరించేవారు. కానీ, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వం ఈసారి డిజిటల్ విధానానికి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలు తమ ఇంట్లో కూర్చునే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ప్రభుత్వ అధికారిక పోర్టల్ se.census.gov.in లోకి వెళ్లి తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. తెలంగాణ డీజీపీ ఈ అవగాహన పోస్టర్లను విడుదల చేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10, 2026 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. స్వీయ గణన విధానం ఎంతో సురక్షితమైనదని, సమయం ఆదా అవుతుందని తెలిపారు. పోస్టర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా నేరుగా వెబ్‌సైట్‌కు వెళ్లి ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. మన లెక్కింపు.. మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Follow Us