/rtv/media/media_files/2025/01/28/oC0cUFZpAAi6uvh55NTX.jpg)
Nagoba Jathara
గిరిజనుల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా జాతర ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర ఈరోజు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర. నేడు మెస్రం వంశస్థులు కాలినడకన బయలు దేరి వెళ్లి కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకొచ్చి.. నాగోబాను అభిషేకిస్తారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. మరోవైపు.. నాగోబా జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. నాగోబా జాతర సందర్భంగా భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర నాగోబా అని అన్నారు. నాగోబా జాతరకు రాష్ట్రం నుంచి కాకుండా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు.
గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో జరిగే నాగోబా జాతరకు.. పోలీస్ శాఖ పూర్తి సంసిద్ధతతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ తెలిపారు. స్థానిక నాగోబా దర్బార్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. మెస్రం వంశీయులు సాంప్రదాయాలు నడుము పండగను జాతరను నిర్వహిస్తారని వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. జాతర బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి నిత్యవసర వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్టును అందజేశారు. జాతర మొత్తాన్ని ఆరు సెక్టార్లుగా విభజించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని, తమకు కేటాయించిన స్థలాలలో మూడు షిఫ్టుల నందు సిబ్బంది ఎల్లవేళలా హాజరుతో ఉంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో జనవరి 28 అనగా రేపటి నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు 8 రోజులపాటు నిర్వహిస్తారు.ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. నాగోబా జాతర ఉత్సవాలను ఆదివాసీలు సంప్రదాయ, ఆచార వ్యవ హారాలతో నిర్వహిస్తారు. ఇప్పటికే పవిత్ర గోదావరి జలాన్ని కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న.. గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొని వచ్చిన మెస్రం వంశస్థులు కేస్లాపూర్ కు చేరుకున్నారు. జనవరి28వ తేదీన రాత్రి పది గంటలకు మహా పూజతో జాతర ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించ నున్నారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. ఈ జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ అలం, ఉట్నూర్ ఏఎస్పి కాజల్ నాగోబా ఆలయాన్ని దర్శించుకుని జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వేడుకల అనంతరం ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. దీనికి స్థానిక ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధికారులందరూ హాజరవుతారు. ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే వీలుంది. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉంది. నిజాం హయాంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు.
అప్పుడు నిజాం దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ 1946లో మొదటిసారి నిర్వహించాడు. స్వాతంత్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు.
క్రీ.శ 740.. కేస్లాపూర్‌లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికిగురై తిరిగి పయనమవుతూ.. పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు. ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయం పట్టుకొని.. తనకు తెలిసిన పురోహితుడిని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకున్నాడు. ఏడు కడవల ఆవుపాలతోపాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడురకాల నైవేద్యాలు సమర్పించి, 125 గ్రామాలమీదుగా పయనిస్తూ, పవిత్ర గోదావరినీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకంచేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్‌లో శాశ్వత నివాసమేర్పరుచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు...