Telangana: అసెంబ్లీలో BRS బిగ్ స్కెచ్..‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’తో ఇరకాటంలో రేవంత్ సర్కార్!

బీఆర్ఎస్ భవన్‌లో కేటీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రపంచ ఎన్నికల వ్యవస్థలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 'అభయహస్తం' మేనిఫెస్టో ఒక పెద్ద ఫ్రాడ్" అని ఆయన వ్యాఖ్యానించారు.

New Update
ktr-vs-bhatti-fire

ktr-vs-bhatti-fire

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి 'ఆరు గ్యారంటీల' అమలు అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను గాలికొదిలేసిందని ఆరోపిస్తూ, వాటికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో శాసనసభ, శాసనమండలిలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

840 రోజులు దాటినా.. ఒక్క హామీ నెరవేరలేదు!

బీఆర్ఎస్ భవన్‌లో కేటీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రపంచ ఎన్నికల వ్యవస్థలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 'అభయహస్తం' మేనిఫెస్టో ఒక పెద్ద ఫ్రాడ్" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 840 రోజులు గడిచినా, ఆరు గ్యారంటీలలో సగం కూడా సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు. గ్యారంటీల పేరుతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లుతో చెక్!

హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో లేదో తేల్చుకోవడానికి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఒక పరీక్ష అని కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే శుక్రవారం ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బిల్లు ప్రవేశపెట్టేందుకు సహకరించాలని గౌరవ స్పీకర్, మండలి చైర్మన్‌లను కేటీఆర్ కోరనున్నారు. సభలోని సభ్యులందరూ పార్టీలకతీతంగా ఈ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

"అధికారంలోకి వచ్చిన తొలిరోజే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల అమలు ఫైలుపై సంతకం చేశారు, గవర్నర్ ప్రసంగంలోనూ వీటిని ప్రస్తావించారు. కానీ 800 రోజులు దాటినా అతీగతీ లేదు. నిజంగా కాంగ్రెస్‌కు అమలు చేయాలనే ఉద్దేశం ఉంటే మా బిల్లుకు మద్దతు ఇవ్వాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఇదే

సాధారణంగా శాసనసభలో లేదా పార్లమెంటులో బిల్లులను ప్రభుత్వ మంత్రులు ప్రవేశపెడుతుంటారు. కానీ, మంత్రి కాని ఏ సభ్యుడైనా (అటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు) ప్రవేశపెట్టే బిల్లును 'ప్రైవేట్ మెంబర్ బిల్లు' అంటారు. సభలో సభ్యుడై ఉండి, మంత్రి పదవిలో లేని ఎవరైనా ఈ బిల్లును తీసుకురావచ్చు. ఇది ప్రతిపక్ష సభ్యులే కావాలని నియమం లేదు, అధికార పార్టీలో ఉండి మంత్రి కాని వారు కూడా దీనిని ప్రవేశపెట్టవచ్చు. ప్రభుత్వ దృష్టికి రాని లేదా ప్రభుత్వం పట్టించుకోని ముఖ్యమైన ప్రజా సమస్యలపై చట్టం చేయాలని కోరుతూ, లేదా ఒక నిర్దిష్ట అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సభ్యులు ఈ అస్త్రాన్ని వాడుతుంటారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలంటే కనీసం ఒక నెల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. (ప్రభుత్వ బిల్లులకు ఇది సాధారణంగా 7 రోజులు ఉంటుంది). ఈ బిల్లుల చర్చ కోసం సభలో ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. సాధారణంగా శుక్రవారాల్లో వీటిపై చర్చ జరుగుతుంది. ఒకవేళ ప్రైవేట్ మెంబర్ బిల్లు సభలో నెగ్గితే (మెజారిటీ సభ్యులు ఓటు వేస్తే), అది కూడా ప్రభుత్వ బిల్లు లాగే చట్టంగా మారుతుంది. అయితే, ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే సభలో అధికార పార్టీకి మెజారిటీ ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం మద్దతు ఇవ్వని బిల్లులు నెగ్గడం కష్టం. ఈ బిల్లులు చట్టాలుగా మారకపోయినా, రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా చేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లేదా కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. భారత పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు కేవలం 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. 1970 తర్వాత ఒక్కటి కూడా చట్టం కాలేదు.

రాజకీయ వ్యూహం

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఆరు గ్యారంటీలను చట్టబద్ధం చేస్తే, వాటి అమలు తప్పనిసరి అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ బిల్లును అడ్డుకుంటే, ప్రజల్లో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ప్రచారం చేయాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. మరి వచ్చే శుక్రవారం సభలో ఈ బిల్లు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు