కొమురవెళ్లి ఆలయంలో కోటి రూపాయల స్కామ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

కొమురవెల్లి దేవస్థానానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. రూ. కోటి అవకతవకలకు సంబంధించి ఐదేండ్ల కిందటి ఫైళ్లు మాయం కావడంతో ముగ్గురు ఉద్యోగులకు కమిషనరేట్‌ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో అందజేయకుంటే క్రిమినల్‌‌ చర్యలుంటాయని హచ్చరించింది. 

New Update
rerererze

TG: కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి దేవస్థానానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. 2014 నుంచి 2018 వరకు ఆదాయ వ్యయాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా రూ. కోటి అవకతవకలకు సంబంధించిన ఐదేండ్ల కిందటి ఫైళ్లు మాయం కావడంతో ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. లావాదేవీలపై ఆడిటింగ్‌‌ నిర్వహించేందుకు కమిషనరేట్‌‌ నుంచి మరోసారి ఆదేశాలు జారీ అయ్యాయి. 

15 మంది ఉద్యోగులకు షోకాజ్‌‌ నోటీసులు..

ఈ మేరకు 2018లో ఆడిటర్‌‌ లక్ష్మీనారాయణ 54 అంశాలపై ఆడిటింగ్‌‌ నిర్వహించగా.. ఎంబీ రికార్డుల్లో చాలా తప్పుడు లెక్కలున్నట్లు బయటపడింది.  మరమ్మతులు, ఉద్యోగుల అడ్వాన్స్‌‌ చెల్లింపులు, గెస్టుల ఫుడ్ ఖర్చు, కార్ల రెంట్లు, బట్టలు, మొక్కల కొనుగోలుతోపాటు బ్యాంక్‌‌ల నుంచి డ్రా చేసిన డబ్బుల రిసిప్ట్‌లు కూడా దొరకకపోవడం సంచలనం రేపింది. రూ.3 కోట్ల పనుల బిల్లులు లేవని గుర్తించిన ఆడిటింగ్‌‌ ఆఫీసర్లు ఉన్నతాధికారులకు రిపోర్ట్‌‌ ఇచ్చారు. 2018 జూలైలో మొత్తం 15 మంది ఉద్యోగులకు షోకాజ్‌‌ నోటీసులు పంపించారు. ఈ నోటీసులకు స్పందించిన కొంతమంది ఉద్యోగులు.. రెండు కోట్ల లెక్కలు చూపించిగా మరో రూ. కోటికి ఆధారాలు చూపించలేదు. దీంతో సంబంధిత ఉద్యోగుల నుంచి రివకరీ చేయాలని అప్పటి కమిషనర్‌‌ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి వసూల్ కాకపోవడం విశేషం. 

రూ. కోటి ఫైళ్లు మాయం..

ఇదిలా ఉంటే.. ఆలయ ఈవో డిసెంబర్ లో రిటైర్డ్ కానుండగా ఫైళ్ల క్లియరెన్స్‌‌ పనులు మొదలుపెట్టారు. అయితే ఐదేండ్ల కింద ఆడిటింగ్‌‌ సమయంలో గుర్తించిన రూ. కోటి ఫైళ్లు కనిపించలేదు. దీంతో ఆడిటింగ్‌‌ జరిగిన సమయంలో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు పంపించారు. ఆలయ సూపరింటెండెంట్‌‌, ప్రస్తుతం కొండగట్టులో పనిచేస్తున్న నీల చంద్రశేఖర్‌‌, మేడారంలో పనిచేస్తున్న జూనియర్‌‌ అసిస్టెంట్లు వై.జగన్‌‌, నర్సింహులుకు వారం రోజుల కింద షోకాజ్‌‌ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైళ్లను పది రోజుల్లో అందజేయాలని, లేదంటే క్రిమినల్‌‌ చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఆలయ ఉద్యోగుల మధ్య గొడవల కారణంగా నోటీసుల విషయం బయటపడింది. ప్రస్తుత ఈవో డిసెంబర్‌‌లో పదవీవిరమణ చేస్తుండడంతో ఆ స్థానంలోకి వచ్చేందుకు కొమురవెల్లి ప్రాంతానికి చెందిన ఓ సీనియర్‌‌ ఉద్యోగి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం నోటీసుల విషయాన్ని లీక్‌‌ చేసినట్లు సమాచారం. కొమురవెల్లికి ఇన్‌‌చార్జ్ లేదా ఈవోగానో వచ్చి ఇక్కడే రిటైర్డ్‌‌ కావాలని సదరు అధికారి కమిషనరేట్‌‌లో వినతిపత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఫైళ్ల మాయమైంది నిజమేనని కొమురవెల్లి ఈవో బాలాజీ తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు