/rtv/media/media_files/2026/02/15/sanjay-2026-02-15-18-18-12.jpg)
mla sanjay vs jeevan reddy
Jagityala : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ అన్ని మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి సవాళ్లు ఎదుర్కొన్న అధికార కాంగ్రెస్ పార్టీ జగిత్యాలలో మాత్రం సొంతపార్టీ లోని రెండువర్గాలతో ఇబ్బందులు ఎదుర్కొంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సంజయ్ కుమార్ లు రెండు వర్గాలు విడిపోయి ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేలా తయారైంది.అయితే ఎన్నికల్లో రెండు వర్గాలు మంచి ఫలితాలు సాధించడంతో వారి మధ్య ఉన్న విభేధాలను రూపుమాపి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైన చే జిక్కించుకోవాలని అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ మేరకు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలిసింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి ఏఐసీసీ రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి 'ఫుల్‌స్టాప్' పడినట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్ ఇరువురు నేతలమధ్య సయోధ్య కుదర్చడానికి విశ్వప్రయత్నం చేసి సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ప్రజాభవన్ లో ఇరు వర్గాల నేతలతో జరిపిన చర్చలు సఫలమై జగిత్యాల ఎపిసోడ్‌కు ముగింపు పలికినట్లు తెలుస్తోంది. దీనికోసం ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి లతో మొదట విడివిడిగా, అనంతరం కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీ తీసుకునే తుది నిర్ణయానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉండాలని సవాంగ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఐక్యత చాటాలని, రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతం దృష్ట్యా నేతలు కలిసి పనిచేయాలని సూచించడంతో ఇద్దరూ అంగీకరించినట్లు తెలిసింది.
ముఖ్యంగా ఈ సమావేశంలో పదవుల కేటాయింపు పై చర్చ జరిగింది. పార్టీ కోసం కష్టపడి, జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు, పాత తరం నాయకులకే మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు చెప్పడంతో జీవన్ రెడ్డి వర్గం హర్షం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అదే సమయంలో సంజయ్ కుమార్ కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సర్దుకుపోయేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. తన ఆలోచనలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని జీవన్ రెడ్డి కోరగా సంజయ్ అంగీకరించినట్టు తెలిసింది. ఈ సమావేశం మంత్రి అడ్లూరి లక్ష్మన్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జీవన్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. జగిత్యాలపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు.
ఈ సందర్భంగా సవాంత్‍తో జీవన్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది. నాకు ఇచ్చిన 16 బీఫామ్ ల్లో 9 చోట్ల గెలిచామని అదే సంజయ్ కు 34 బీఫామ్ లు ఇస్తే 14 మాత్రమే గెలిచారని సవాంత్ దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్ పక్కన పెట్టిన 9 మంది ఇండిపెండెంట్లుగా గెలిచారని తన వర్గానికి బీ ఫామ్ లు ఇవ్వలేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీంతో మొత్తం జగిత్యాల మున్సిపాలిటీలో ఒక ప్రతిపాదనగా చైర్మన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ పదవి జీవన్ వర్గానికి. రెండో ప్రతిపాదనగా చెరో రెండున్నరేళ్లు చైర్మన్ పీఠం పంచుకునేలా ఇరు వర్గాలకు సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వర్గంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మొత్తం మీద ఇరువర్గాలు ఒక నిర్ణయానికి వచ్చినట్ల తెలుస్తోంది.
Follow Us