/rtv/media/media_files/2026/04/09/tdf-2026-04-09-20-26-55.jpg)
Telangana Medical and Health Services Recruitment Board
Telangana Doctors Federation : తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ (TDF) సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..పలువురు అభ్యర్థుల నుంచి అందిన నివేదికలు, విజ్ఞప్తులను ఆధారంగా చేసుకుని అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకున్నామని టీడీఎఫ్ తెలిపింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. మార్కుల కేటాయింపుల్లో అస్థిరతలు ఉన్నాయని, నియామక ప్రక్రియ మెరిట్ ప్రాతిపదికన జరగలేదన్నది స్పష్టమవుతుందని టీడీఎఫ్ ఆరోపించింది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని వారు ఆరోపించారు. ఒక్కో పోస్టుకు రూ.12 లక్షల నుండి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందినట్టు టీడీఎఫ్ ఆరోపించింది. కాగా, ప్రస్తుతం వివిధ విభాగాల్లో సుమారు 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ప్రస్తుతం నియమాకానికి పరిశీలనలో ఉన్నాయని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ (TDF) తెలిపింది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/04/09/552142-whatsapp-image-2026-04-09-at-63358-pm-2026-04-09-20-27-40.webp)
వైద్య విద్యలో నియామకాలు అత్యున్నత స్థాయి పారదర్శకతతో జరగాలని, అలా జరగని పక్షంలో అది రాష్ట్రంలోని వైద్య సేవలు, వైద్య విద్య నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని టీడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని టీడీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ ప్రక్రియలో ఎంపిక ప్రమాణాలు, మూల్యాంకనంలో పూర్తి పారదర్శకతను పాటించాలని కోరింది. అలాగే నియామకంలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీఎఫ్ డిమాండ్ చేసింది. అర్హులైన అభ్యర్థుల హక్కులు, ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేసింది. అన్ని వైద్య, విద్యా ప్రక్రియల్లో నైతిక ప్రమాణాలు, నిష్పాక్షికతను కాపాడటానికి TDF కట్టుబడి ఉందని ఈ సందర్భంగా టీడీఎఫ్ స్పష్టం చేసింది.
Follow Us