/rtv/media/media_files/2025/02/03/RFjSxt2mzOtd8xoszSXd.jpg)
KCR meeting
KCR public meeting : తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి వేగంగా మారిపోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల20న బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వేలాదిమంది తన అనుచరులతో కలిసి ఆయన బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఈ సందర్భంగా 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ మేరకు పట్టణంలోని మోతె రోడ్డులో సభా స్థలిని దీనికోసం ఎంపిక చేశారు. ఈ వేదికను జీవన్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ కీలక నేతలతో కలిసి పరిశీలించారు. ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, మోతే రోడ్డు వంటి ప్రాంతాలను ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ఆయన సందర్శించారు. పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని భావిస్తుండటంతో అందుకు తగిన స్థలం కోసం వారు వెతుకుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, సుమారు లక్ష మందితో ఈ భారీ సభను సక్సెస్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ సభ ద్వారా స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు.
చాలా రోజుల తర్వాత జనం మధ్యకు కేసీఆర్
2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రావడం లేదు. అప్పుడప్పుడు, అక్కడక్కడా కనిపిస్తున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం కేసీఆర్ ప్రజల్లో ఉండటం లేదు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. దీంతో తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు.. కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 20వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రెండున్నర సంవత్సరాల తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననుండటంతో పాటు జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జనం ఆసక్తిగా ఈ సభకోసం వేచి చూస్తున్నారు.
రాష్ర్టంలో అధికార కాంగ్రెస్ పార్టీపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది.
బాధ్యుల నియామకం
ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా బహిరంగ సభ ఏర్పాట్ల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జీలను ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జీలను కేటీఆర్ ప్రకటించారు. జగిత్యాలకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోరుట్లకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ ఎల్.రవీందర్‌రావు, వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షిస్తారని వెళ్లడించారు.. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
Follow Us