Jana Sena : జనసేన అధినేత పవన్ ఇంటి వద్ద హై టెన్షన్...హైదరాబాద్ లో అసలేం జరుగుతుంది?

తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  తలపెట్టిన ‘నవ నిర్మాణ సంకల్ప సభ’ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ సభ చుట్టూ నడుస్తున్న హైవోల్టేజ్ రాజకీయాల నేపథ్యంలో హైదరాబాద్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

New Update
Pawan Kalyan

Pawan Kalyan

Jana Sena :  తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  తలపెట్టిన ‘నవ నిర్మాణ సంకల్ప సభ’ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ సభ చుట్టూ నడుస్తున్న హైవోల్టేజ్ రాజకీయాల నేపథ్యంలో హైదరాబాద్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం'కు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులను కారణంగా చూపుతూ పోలీసులు బ్రేక్ వేశారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు దానిని తిరస్కరించడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు గట్టి చుక్కెదురైంది.

మరోవైపు, జనసేన సభకు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ వాదులు రంగంలోకి దిగారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా సభపై ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దని వారు కోర్టును కోరారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ఆంధ్రాకు చెందిన నాయకుడు ఇక్కడ సభ పెట్టడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును కించపరచడమేనని, పవన్ సభలు ఏవైనా ఉంటే ఆయన స్వరాష్ట్రంలోనే చూసుకోవాలని వారు స్పష్టం చేశారు.

హైకోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురికావడం, మరోపక్క తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో పోలీసులు పవన్ ఇంటిని చుట్టుముట్టారు. ఎవరూ లోపలికి రాకుండా రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి టైట్ సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. అటు జనసేన శ్రేణులు కూడా అలర్ట్ అయ్యాయి. ఉద్రిక్తతలను ముందే ఊహించిన పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ కోసం భారీ సంఖ్యలో ప్రైవేట్ బౌన్సర్లను రంగంలోకి దించారు.

పవన్ కల్యాణ్ సభ, తెలంగాణ పర్యటనపై టీపీసీసీ (TPCC) చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని, గత వ్యాఖ్యలపై పవన్ మొదట తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా నాయకులకు తెలంగాణ గడ్డపై ఏం పనని ప్రశ్నించిన ఆయన, అక్కడి నేతలు ఆంధ్రాలోనే రాజకీయం చేసుకోవాలని హితవు పలికారు. ఇక్కడ మనుగడ లేని పార్టీలు తెలంగాణలో ఎలా సక్సెస్ అవుతాయని ప్రశ్నించారు.

తెలంగాణలో సొంతంగా ఎదిగే సత్తా లేక ఇతర పార్టీల అండతో పవన్ పాలిటిక్స్ చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. టీడీపీ, బీజేపీలకు తొత్తులుగా మారి.. ఆ పార్టీల డైరెక్షన్‌లో ఇక్కడకు వచ్చి పార్టీ నిర్మాణం చేస్తానంటే తెలంగాణ ప్రజలు అస్సలు ఒప్పుకోరని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇక్కడి ఉద్యమకారులను కించపరిచేలా వ్యవహరిస్తున్న జనసేన వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.

 పోలీసుల ఆంక్షలు, కోర్టు పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. గచ్చిబౌలి సభ క్యాన్సిల్ అవ్వడంతో ఈరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తన జూబ్లీహిల్స్ నివాసంలోనే ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. "కనీసం జనసేన నేతలతో కలిసి నిర్వహించే ఈ మీడియా సమావేశానికైనా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నా.. చూద్దాం ఏం జరుగుతుందో!" అంటూ పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ ప్రెస్ మీట్‌లో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు