/rtv/media/media_files/2026/04/24/fotojet-2026-04-24-08-37-52.jpg)
Extreme tension in Narsampet
Narsampet : వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు, ఆందోళనకు దారితీసింది. ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతితో నర్సంపేట ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా తన ప్రాణాలను పణంగా పెట్టిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (56), హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో పోరాడిన ఆయన, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయాన్నే శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామానికి తరలించారు.గత 25 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్‌గా సేవలందిస్తున్న శంకర్‌కు భార్య హేమలత, కుమార్తె షామిలి, కుమారుడు హేమంత్ ఉన్నారు. తండ్రి మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
శంకర్ గౌడ్ మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో తోటి ఆర్టీసీ కార్మికులు, అభిమానులు కడసారి చూపు కోసం భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, నిరసనలు ఉధృతం కాకుండా పోలీసులు ముత్తోజిపేట గ్రామంలో భారీగా మోహరించారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే తమ సహచరుడు ప్రాణాలు కోల్పోయాడంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటన రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతోంది. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నర్సంపేటకు రానున్నట్లు సమాచారం. ఆయన శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉంది. శంకర్ గౌడ్ మరణానికి నిరసనగా బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు నర్సంపేట పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి నిరసనలో పాల్గొనాలని కోరారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఈ మరణ వార్తతో జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
డిపో వద్ద నివాళులకు కార్మికుల పట్టు
ఆర్టీసీ సమ్మెలో భాగంగా ప్రాణత్యాగం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం ఆయన స్వగ్రామమైన ముత్తోజిపేటకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, తమ సహచరుడికి నివాళులు అర్పించే విషయంలో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్విదాం చోటు చేసుకుంది. ముత్తోజిపేటలో ఉన్న శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపోకు తరలించి అక్కడ నివాళులు అర్పిస్తామని కార్మికులు పట్టుబట్టడంతో నర్సంపేట పట్టణంలో యుద్ధ వాతావరణం నెలకొంది."శంకర్ గౌడ్ మా కుటుంబ సభ్యుడు. 25 ఏళ్లుగా ఈ డిపోలోనే ఆయన సేవలందించారు. ఆయన ప్రాణత్యాగం చేసిన చోటే మేము నివాళులు అర్పించి, చివరి వీడ్కోలు పలుకుతాం" అని కార్మికులు డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ను వేడుకుంటున్నారు. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదని, తమ భావోద్వేగాలకు సంబంధించిన విషయమని వారు స్పష్టం చేస్తున్నారు.శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు డిపో వద్దకు మృతదేహాన్ని తీసుకురావడానికి అనుమతి నిరాకరిస్తున్నారు. కాగా మృతదేహన్ని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు.
ఉద్రిక్తల నేపథ్యంలో నర్సంపేట పట్టణం, ముత్తోజిపేట మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీసీపీ రాజమహేంద్ర నాయక్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
పోలీసుల నిరాకరణతో ఆగ్రహించిన కార్మికులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండటంతో ఉద్రిక్తత క్షణక్షణం పెరుగుతోంది.ప్రస్తుతం నర్సంపేటలో దుకాణాలు మూతపడ్డాయి. రాజకీయ నేతలు, ఇతర సంఘాల నాయకులు కూడా ముత్తోజిపేటకు చేరుకుంటుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. తమ సహచరుడికి డిపోలో నివాళులు అర్పించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Follow Us