Dasara 2024: దసరాకు దిమ్మతిరిగే షాక్.. పండుగ పూట పస్తులే.. ఎందుకంటే?

వానలు, వరదలతో ఇన్నాళ్లూ ఇబ్బంది పడ్డ ప్రజానికం దసరా, బతుకమ్మ వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఆనందంగా ఈ పండుగ వేడుకలను జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. వారందరికీ ఓ బిగ్ షాక్.. ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

New Update

దసరా వచ్చేస్తోంది.. పిల్లలంతా ఎంతో హుషారుగా ఉన్నారు.. అటు ఇంట్లో అమ్మ కూడా పిల్లల కోసం ఏం వంటకాలు చేయాలో అని తెగ ఆలోచిస్తూ ఉంది. కాసేపు టీవీ చూద్దాం అని స్వీచ్‌ ఆన్‌ చేసి న్యూస్‌ ఛానెల్ పెట్టింది. అంతే ఒక్కసారిగా దెబ్బకు షాక్ అయ్యింది. నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయేయన్న వార్త అది. వారం రోజుల ముందుకి ఈ రోజుకు ధరల్లో ఎంత తేడా..! ఉల్లి, వెల్లులి 50 రూపాయలు పెరగడమేంటి? ఆ నూనె ధరలు కూడా అడ్డదిడ్డంగా పెరిగిపోయాయి. ఇటు కూరగాయాలు రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. మరి దసరా చేసుకునేది ఎలా? ఒక్కసారిగా ధరలు ఇంతలా ఎలా పెరిగాయి?

ఓ వైపు జీతాలు పెరగక.. వచ్చే జీతం సరిపోక మిడిల్‌క్లాస్‌ ప్రజలు ఇప్పటికే అల్లాడిపోతూంటే మరోవైపు నిత్యావసర ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నెల రోజుల క్రితం కిలో రూ.25 నుంచి రూ.30 పలుకగా, ప్రస్తుతం కిలో రూ.70కి చేరింది. తెలంగాణ రైతు బజార్ల ధరల లిస్ట్‌ ప్రకారం ప్రస్తుతం కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. అయితే, స్థానిక దుకాణాలు కిలోకు రూ.70కి పైగా వసూలు చేస్తున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఉల్లి పంటలు పాడైపోయాయి. ఫలితంగా నగరంలో సరఫరా కొరత ఏర్పడింది. మలక్‌పేట్, బోయిన్‌పల్లి, మూసాపేట్, గుడిమల్కాపూర్‌తో సహా హైదరాబాద్‌లోని ప్రధాన  మార్కెట్‌లకు ఉల్లి సరఫరా గణనీయంగా తగ్గడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

అన్ని ధరలు పైపైకి..

అటు అల్లం, వెల్లుల్లి ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. వారం వ్యవధిలో ఏకంగా 60 రూపాయల పెరుగుదలను నమోదుచేశాయి. అల్లం కిలో గత వారంలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కాస్త 160రూపాయలకు చేరింది. వెల్లుల్లి కేజీ 300 నుంచి 360కు చేరింది. మాల్స్‌లో ఈ ధర అంతకంటే ఎక్కువగానే ఉంది. ఎండుమిర్చి కేజీ ఒక్కసారిగా 50రూపాయలకు పెరిగింది. గత వారం 200 రూపాయలగా ఉన్న కేజీ ఎండుమిర్చి ఇప్పుడు 250కు చేరింది. మరోవైపు పప్పులు ధరలు కూడా మండిపోతున్నాయి. వారం వ్యవధిలో కందిపప్పు 20రూపాయలు పెరగగా.. పెసరపప్పు ఏకంగా 30రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కందిపప్పు 170 వద్ద ఉండగా.. పెసరపప్పు రూ.150 వద్ద ఉంది.

మరోవైపు పండుగల సీజన్‌లో ఎడిబుల్‌ ఆయిల్‌ ధరలను స్థిరంగా ఉంచాలని ఆహార శాఖ సూచించినప్పటికీ లీటరుకు రూ.8-22 మేర ధరలు పెరిగాయి. ఇక ఇప్పటికే కేంద్రం సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పెంచింది. రైతుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది. ఇక అప్పటికే నూనె తయారీ కంపెనీల్లో రెండు నెలలకు సరిపడ స్టాక్ ఉంది. దీంతో పండుగ సమయానికి నూనె కంపెనీలు ధరలను పెంచవని కేంద్రం భావించింది. అయితే నూనె కంపెనీలు మాత్రం ధరలు పెంచేశాయి. గత రెండు వారాల్లో ఆవనూనె సగటు ధర లీటరుకు రూ.141 నుంచి రూ.152కి పెరగగా, సెప్టెంబర్ 12న రూ.100గా ఉన్న పామాయిల్ రూ.122కు పెరిగింది.

ఇటు బియ్యం రూపంలో సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయడంతో బియ్యం రేట్లు భారీగా పెరగడం ఖాయమనే చెప్పాలి. అటు షుగర్‌ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్న వార్త సామాన్యులను మరింత కలవర పెడుతోంది. పంచదార కనీస అమ్మకపు ధర పెంచాలని కేంద్రం భావిస్తోంది. మరికొన్ని రోజుల్లో పంచదార ఎగుమతి విధానాన్ని కేంద్రం సమీక్షించే అవకాశం ఉంది. అటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా ఇప్పటివరకు ఇండియాలో పెట్రో ధరలు మాత్రం తగ్గకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఇలా పండుగ సమయంలో సామాన్యుడికి ఏదీ కలిసిరాకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు